Telangana Politics: దేశరాజధానిలో తెలంగాణ రాజకీయాలు.. కీలక నేతలు అక్కడే మకాం.. అసలేం జరుగుతోంది?

ఢిల్లీ కేంద్రంగా మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు మంగళవారం సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇదిలా ఉండగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.

Written By: Mahi, Updated On : November 12, 2024 1:30 pm

Telangana Politics

Follow us on

Telangana Politics: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రిని కలిసి అమృత్ నిధులను సీఎం రేవంత్ రెడ్డి పక్కదారి పట్టించారంటూ ఫిర్యాదు చేశారు. తన బావమరిది సృజన్ రెడ్డికి సీఎం లబ్ధి చేకూర్చారంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను ఢిల్లీలో ఉండగానే తెలంగాణలో ప్రకంపనలు అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. తన పర్యటన కొందరు నేతల్లో బుగులు పుట్టించిందని ఎద్దేవా చేశారు. మరోవైపు కేటీఆర్ పర్యటన పై మంత్రి పొంగులేటి స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలంటూ మండిపడ్డారు. అసలు కేటీఆర్ కు ఢిల్లీలో ఏం పనంటూ మండిపడ్డారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇది 26వ సారి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. గత కొంతకాలంగా రేవంత్ కు అధిష్ఠానం తో కొంత దూరం పెరిగినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినేట్ విస్తరణపై ఆయన పార్టీ పెద్దలతో మాట్లాడనున్నట్లు సమాచారం.
దీంతో పాటు త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నది. దీనిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తున్నది. కాగా పార్టీ పెద్దలు ఆయనను కలుస్తారా.. లేదా అనేది సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. ఇటీవల సీఎం బర్త్ డే సందర్భంగా కనీసం విషెస్ కూడా చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా ఏ ఒక్కరూ ఆయన సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పలేదు. ఒక రాష్ర్ట సీఎం ను ఇలా విస్మరిస్తున్నారంటే తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అనుమానాలు అందరిలో వినిపిస్తున్నాయి.

గవర్నర్ కూడా..
మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి జరిగిన అవినీతిలో కేసులు నమోదు చేసేందుకు అవకాశమివ్వాలంటూ ఇటీవల ప్రభుత్వం ఆయనకు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఈ పర్యటన చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నేతలపై కేసులు తప్పవేమోననే అభిప్రాయం వినిపిస్తున్నది.

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ ను కలిసి ఇదే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తున్నది. ఏదేమైనా గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్షంలో కీలక నేత కేటీఆర్ ఇఫ్పుడు ఢిల్లీలో మకాం వేయడం రాజకీయంగా వేడెక్కింది. ఈ ఢిల్లీ రాజకీయం ఏంటో తెలియక అంతా తలలు పట్టుకుంటున్నారు.