Vikarabad Issue: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో సోమవారం జరిగిన దాడి రాష్ర్టవ్యాప్తంగా సంచలనమైంది. ఈ దాడి రాష్ర్టంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. రాష్ర్టంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఆ పార్టీ మండిపడుతున్నది. ఫార్మాక్లస్టర్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయసేకరణ కోసం గ్రామసభ ఏర్పాటు చేశారు. ఇందుకోసం కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్ లింగచర్లకు చేరుకున్నారు. అక్కడ వారిపై పలువురు దాడికి యత్నించారు. అనంతరం వారి వెనుక వెళ్లిన కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిని తీవ్రంగా కొట్టారు. వీరు పరుగులు పెడుతున్నా రెచ్చిపోతూ ఉద్రిక్త పరిస్థితులను సృష్టించారు. మొత్తంగా 775 ఎకరాల కోసం ఈ ప్రజాప్రాయసేకరణ సభను అధికారులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ వాహనం దిగి, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే స్థానికులు రెచ్చిపోయారు.
దాడి వెనుక కుట్ర?
దాడి వెనుక కుట్ర ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఓ పార్టీ నేతలు ఇందులో వ్యూహరచన చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కలెక్టర్ ను ఓ నేతే స్వయంగా ఆ గ్రామానికి తీసుకెళ్లడం వెనుక కుట్రకోణం ఉన్నట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉందని రాష్ర్టవ్యాప్తంగా అన్వయించవచ్చని పథకం ప్రకారం ఈ దాడికి కుట్రపన్నినట్లుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ పార్టీకి చెందిన కీలక నేత పేరును పోలీస్ ఉన్నతాధికారి ఒకరు నేరుగానే ప్రకటించారు. అయితే పూర్తి విచారణ చేపడుతన్నామని, దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని చెబుతున్నారు. అందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. అధికారుల వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమయ్యారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఉద్యోగులపై దాడి నిందితులను శిక్షించాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
నిఘా వైఫల్యం?
గ్రామంలో ప్రజాభిప్రాయసేకరణ ఉందని ముందుగానే సమాచారం అందించారు. ఈ క్రమంలో ఇంత మంది గుమిగూడి దాడికి వ్యూహరచన చేస్తున్నా పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న. దీనిని నిఘా వైఫల్యంగానే అంతా భావిస్తున్నారు. మరోవైపు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పై వేటు వేయబోతున్నట్లుగా సమాచారం అందుతున్నది.
అయితే దీనిపై ఐజీ సత్యనారాయణ పూర్తి వివరణ ఇచ్చినా నిఘా వైఫల్యం కారణంగానే కలెక్టర్ ప్రాణానికి ఒక్కసారిగా ప్రమాదం ఏర్పడిందని చెబుతున్నారు. గత నెల 25న కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడి జరిగింది. దీనిని గుర్తించైనా పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఈ దాడి జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.