Telangana Political Drama: కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అప్పట్లో ఓ వర్గం మీడియా ఈ విషయాన్ని భారీగానే ప్రచారం చేసినప్పటికీ.. కెసిఆర్ కన్నెర్ర చేయగానే ఆ ప్రచారం ఆగిపోయింది. ఆ తర్వాత హరీష్రావు తన దగ్గరికి పిలిపించుకొని.. మంత్రి పదవి ఇచ్చేసరికి ఆ ప్రచారం మొత్తం గాలిలో కలిసిపోయింది. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నామంటే.. పార్టీ మీద పట్టు ఉన్నప్పుడు.. పార్టీ వ్యవహారాలు పకడ్బందీగా సాగుతున్నప్పుడు ఇలాంటి విషయాలు ఎక్కువగా మనుగడలో ఉండవు. అదేం దరిద్రమో కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివేవీ ఉండవు. అధ్యక్షుడి మాటను కిందిస్థాయి నాయకులు పాటించరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. పైగా దీనిని అంతర్గత ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకుంటారు.
Also Read: మెదక్ ఎంపీకి ఆగని బెదిరింపులు.. అగంతకులను గుర్తించిన పోలీసులు?
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది ఉండదు. ఎందుకంటే అందరికీ విపరీతమైన స్వాతంత్రం ఉంటుంది కాబట్టి లెక్కలేనితనంగానే వ్యవహరిస్తుంటారు. గతంలో జరిగిన పరిణామాలు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పై ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నిరసన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ తన ఆగ్రహాన్ని, తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. “ఖమ్మంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. నల్లగొండలో 11 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. మా ఇంట్లో ఇద్దరు సమర్ధులైన అన్నదమ్ములమున్నాం. అది మా తప్పు ఎలా అవుతుంది. ఇద్దరు సమర్ధులైన సోదరులు ఒకే ఇంట్లో ఉంటే అది మా తప్పా. ఆరోజు నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు కదా.. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా రెండవసారి వాగ్దానం చేశారు కదా.. ఇప్పుడు ఎందుకు సమీకరణాలు కుదరడం లేదు.. నాకెందుకు మంత్రి పదవి దక్కడం లేదు” ఇదిగో ఇలా సాగిపోతోంది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.
Also Read: కల్వకుంట్ల కవిత హెచ్చరిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఇకనైనా మారుతుందా..
ఇటీవల కాలంలో అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచుతున్నారు. రేవంత్ రెడ్డి పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డే అని చెప్పకనే చెబుతున్నారు.. భట్టి విక్రమార్క ఇటీవల ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను రాజగోపాల్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. మొత్తానికి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నది రేవంత్ రెడ్డి అని ఓపెన్ గానే రాజగోపాల్ రెడ్డి చెప్పేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? మీనాక్షి నటరాజన్ ఏం చేస్తోంది? అబ్బే భలే వారే.. ఇలాంటి వారి పట్ల కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదు. చర్యలు తీసుకునే సాహసం చేయదు. ఒకవేళ అలా చేస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది..