CM Revanth Reddy : సాధారణంగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అంతర్గతంగా జరిగే విషయాలు రహస్యంగా ఉంటాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. అంతర్గత విషయాలు బహిర్గతమవుతున్నాయి. కేబినెట్ నిర్ణయాలు వెంటనే తెలిసిపోతున్నాయి. పథకాల సంబంధించిన సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలు బయటకు చేరిపోతున్నాయి.. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం పూర్తికావడమే ఆలస్యం.. ఆ సమాచారం మొత్తం గులాబీ నేతలకు తెలిసిపోతుంది. దీంతో గులాబీ నాయకులు వెంటనే తమ వాయిస్ వినిపిస్తున్నారు.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీరిగ్గా ఇన్ని రోజులకు “గులాబీ” బ్యూరోక్రాట్లపై నజర్ పెట్టిందని తెలుస్తోంది. కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదని.. ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంతమంది మంత్రులు వివిధ అంశాలపై కీలక అధికారులతో చర్చించారు. అయితే ఆ విషయం కూడా భారత రాష్ట్ర సంత నేతలకు తెలిసింది.. దీంతో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మంత్రులు నిర్వహించిన సమావేశం వివరాలను కూడా వారు వెల్లడించారు. దీంతో ఆ మంత్రులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఫలితంగా వారు ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లెక్కలేకుండా పోయింది
ప్రభుత్వం ఎన్నిసార్లు సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అయితే కీలకమైన సమాచారాన్ని బ్యూరోక్రాట్లు ఎందుకు గులాబీ నేతలకు చేరవేరుస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ నాయకులతో ఎందుకు అంత సన్నిహితంగా ఉంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినప్పటికీ.. ఎందుకు బ్యూరోక్రాట్లు సర్కార్ కు దగ్గర కాలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి కూడా అధికారుల మనసులు ఎందుకు గెలవలేక పోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గులాబీ నేతలతో అధికారులు సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అయితే ఇటీవల ఏసీబీ దాడులు పెరిగిపోవడం.. కొందరు అధికారులను ప్రభుత్వం లూప్ లైన్లోకి పంపించడం.. కోరుకున్న చోటుకు బదిలీలు చేయకపోవడం.. వంటి కారణాలవల్ల బ్యూరోక్రాట్లు ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నట్టు తెలియవస్తోంది. మరి ఈ సమస్యకు రేవంత్ రెడ్డి ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సి ఉంది. ” ప్రభుత్వ అంతర్గత సమాచారం ఎప్పటికప్పుడు భారత రాష్ట్ర సమితికి చేరిపోతోంది. దీనివల్ల ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ సమస్యను రేవంత్ ఇప్పటికే పరిష్కరించారని.. మిగిలిన వారిని కూడా సెట్ రైట్ చేస్తే ఇబ్బంది ఉండదని” కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.