Telangana municipal elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ పూర్తయిపోయింది. అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్, బిజెపి, బి ఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా బరిలో ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కానుకలు.. డబ్బు.. మద్యం.. మాంసం.. ఇంకా అనేక రకాల కానుకలు ఇస్తున్నాయి.
వాస్తవానికి ఎన్నికల వ్యవహారం సాఫీగా సాగిపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఆలియాబాద్ లో ఘర్షణ చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో గులాబీ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం దూషించుకున్నారు. మాట మాట పెరగడంతో అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది.
నాయకులు హద్దులు దాటి ప్రవర్తించడంతో అక్కడ రణరంగం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డి కారును ధ్వంసం చేశారు. మల్లారెడ్డి కి అనుసరుడైన పరమేశ్వర్ పై దాడి చేశారు.. ఈ దాడికి డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ అనుచరులు కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ పరిస్థితి ఊహించని విధంగా మారిపోయింది.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే రెండు పార్టీల నాయకుల మధ్య వివాదం ఏర్పడిందని అందువల్లే ఈ స్థాయిలో గొడవ జరిగిందని తెలుస్తోంది.. మల్లారెడ్డి అనుచరుడిపై దాడి చేసిన నేపథ్యంలో గులాబీ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. మల్లారెడ్డి పై దాడి జరిగిందని మీడియాలో వార్తలు రావడంతో మొదట్లో కలకలం నెలకొంది. ఆ తర్వాత మల్లారెడ్డి అనుచడి పై దాడి జరిగిందని తెలియడంతో పరిస్థితి కాస్త కుదుటపడింది.
