Kavitha New Party: అందరూ ఊహించిందే జరిగింది. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ప్రకటించారు. తన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలిలో చివరి ప్రసంగం చేసిన కవిత.. భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. నైతికత లేని బీఆర్‌ఎస్‌లో ఉండలేనని వెల్లడించారు. తర్వాత బయటకు వచ్చి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
అందరినీ కలుపుకుని పార్టీ..
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ప్రతినిధులుగా అసెంబ్లీలో అడుగు పెడతామని ప్రకటించారు. ఇక తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని, తెలంగాణలో వివక్ష, అణచివేతకు గురైనవారు తనతో కలిసిరావాలని కోరారు.
త్వరలో విధి విధానాలు..
తెలంగాణ జాగృతి పార్టీ ఎలా ఉండబోతుందో త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తానని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాని విద్యార్థులు, అన్యాయానికి గురైన కార్మికులు, కర్షకులు, ప్రజల పక్షాన పోరాటాలు చేసే కమ్యూనిస్టులు తనతో కలిపి రావాలని కోరారు. అందరికీ న్యాయం జరిగేలా పోరాడేందుకే తెలంగాణ జాగృతి పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్‌లోని తెలంగాణ వాదులు బయటకు రావాలన్నారు. తెలంగాణ ఉద్యమద్రోహుల రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు.