AP Next Assembly Elections: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రజల్లోకి వస్తోంది. కానీ కూటమిసైతం వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పు ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. పొత్తుల్లో కుదిరిన సీట్లు కూడా మారుతాయి అన్న ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు మారుతారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఈసారి జనసేన పోటీ చేస్తుందన్న ప్రచారం తెగ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారని హడావిడి నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఇదే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎలమంచిలిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో ఆ సీటును బిజెపికి కేటాయించడంతో నాగబాబు తన ఆలోచనను విరమించుకున్నారు.
పొలిటికల్ గా హాట్ నియోజకవర్గం
ఉత్తరాంధ్రలో( North Andhra ) అనకాపల్లి పార్లమెంటు స్థానం హాట్ సీటు. అక్కడ నుంచి గెలవాలంటే తప్పకుండా కుల సమీకరణ ఉంటుంది. ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వెలమలతో పాటు కాపులు అధికం. ఆపై గవర, యాదవ సామాజిక వర్గాలు సైతం ప్రభావం చూపుతాయి. అయితే 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించారు నాగబాబు. అంతకు ముందు ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీకి దిగారు. కానీ ఓడిపోయారు. ఎంపీగా ఢిల్లీ వెళ్లాలన్నది నాగబాబు ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ కాబట్టి.. నాగబాబు ఆ ప్రయత్నంలో ఉండేవారు. కానీ సీఎం రమేష్ బీజేపీ కీలక నేతగా మారారు. మొన్నటి పొత్తులో కీలకంగా వ్యవహరించారు. అందుకే కడప జిల్లాకు చెందిన ఆయనను అనకాపల్లికి తెప్పించి మరీ పోటీ చేయించారు. ఒక్క అనకాపల్లి మాత్రమే కాదు ఉత్తరాంధ్రలో ఆర్థిక బాధ్యతలు కూడా చూశారట సీఎం రమేష్. అప్పటికే సిట్టింగ్ మంత్రిగా ఉన్న ముత్యాల నాయుడును ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు సీఎం రమేష్.
ఎట్టకేలకు ఫుల్ క్లారిటీ..
అయితే వచ్చే ఎన్నికల్లో సీఎం రమేష్ ను ( CM Ramesh)మార్చుతారని ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్లు మారుతాయి అని కూడా టాక్ నడుస్తోంది. అనకాపల్లి ఎంపీగా మెగా బ్రదర్ నాగబాబు కానీ.. ఆ కుటుంబం నుంచి మరొకరు కానీ పోటీ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఎంపీ సీఎం రమేష్. ఎట్టి పరిస్థితుల్లో మార్పు ఉండదని.. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి తానే పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కూడా సూచించారు. ఇదంతా కూటమి ప్రత్యర్ధులు చేస్తున్న దుష్ప్రచారంగా తేల్చేశారు. మొత్తానికి అయితే అనకాపల్లి నుంచి మరోసారి సీఎం రమేష్ ఉంటారని తేలిపోయింది. ఇకనైనా దుష్ప్రచారానికి చెక్ పడుతుందా? లేదా? అన్నది చూడాలి.