Telangana: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలనపై వరుస కథనాలతో దుమ్మెత్తి పోస్తున్న కొన్ని పత్రికలు.. తెలంగాణలో అతిపెద్ద కుంభకోణంగా ప్రభుత్వం ప్రకటించిన కాళేశ్వరంపై మాత్రం కథనాలు రాయడానికి జంకుతున్నాయి. కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాయి. ఏపీలో మాత్రం చిన్న పొరపాటును కూడా బూతద్ధంలో చూపుతూ కథనాలు వండి వారుస్తున్నాయి.
ఒక్కో కుభకోణం వెలుగులోకి..
తెలంగాణలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్.. తమ హయాంలో చేసిన కుంభకోణాలు, అక్రమాలు, ఖర్చులు, నిధుల మళ్లింపు, అప్పుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా బయటపెడుతోంది. కాళేశ్వరాన్ని దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణల్లో లోపాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వం ఆధారాలతో బయటపెడుతున్న తప్పుకు సమాధానం చెప్పుకోలేక బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత అసెంబ్లీకే రావడం లేదు. ఇక హరీశ్‌రావు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. కానీ వీటిపై ఎలాంటి కథనాలు పత్రికల్లో కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
తాజాగా గొర్రెల కుంభకోణం..
ఇక తెలంగాణలో గొర్రెల పంపిణీ పెద్ద కుంభకోణంగా కాగ్ పేర్కొంది. ప్రభుత్వం ఒక నంబర్ వాహనంలో 120 యూనిట్ల గొర్రెలను తరలించినట్లు పేర్కొందని, కానీ, అది ఒక బైక్ నంబర్ అని తెలిపింది. ఒక బైక్‌పై ఎలా ఇన్ని గొర్రెలు తరలించారో అంతుచిక్కడం లేదు. 120 యూనిట్ల గొర్రెలను ఏపీ రైతులవద్ద కొనుగలో చేసి రూ.2.10 కోటను రైతులకు చెల్లించకుండా బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు పేర్కొంది. ఇందులో కాంట్రాక్టర్‌కు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయి సహకరించారని తెలిపింది.
మాజీ మంత్రి ఆదేశాల మేరకే..
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకే పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మొహియుద్దీన్ తమ వద్ద గొర్రెలు కొనుగోలు చేసినట్లు ఏపీ రైతులు తెలిపారని కాగ్ పేర్కొంది. గొర్రెల స్కీంలో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిని కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ పత్రికల్లో పెద్దగా కథనాలు రావడం లేదు.
ఏసీబీ విచారణ..
మరోవైపు ప్రభుత్వం గొర్రెల స్కీంలో స్కాంపై విచారణకు ఏసీబీని ఆదేశించింది. దీంతో ఏసీబీ కూడా దూకుడు పెంచింది. తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్‌డీ కళ్యాణ్‌పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నట్లు తెలిసింది. త్వరలో ప్రాథమిక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.