https://oktelugu.com/

Telangana Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా చేరడం లేదు.. ఏమిటీ పరిణామం.. ఎందుకీ దుస్థితి?

సర్కార్ ఉద్యోగం కోసం గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సిటీకి వచ్చి మరీ కష్టపడుతుంటారు. ఏళ్లుగా ఖర్చులు చేస్తూ.. నిద్రాహారాలు మాని కష్టపడి చదువుతారు. అయితే.. ప్రభుత్వ కొలువు దక్కినా కొందరు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 17, 2024 / 02:36 PM IST

    Telangana Govt Jobs

    Follow us on

    Telangana Govt Jobs: దేశంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం లక్షలాది యువత ఎదురుచూస్తూనే ఉంది. డిమాండుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోవడంతో నానాటికీ నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. అయితే.. ఇక్కడ మాత్రం వింత పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ జాయిన్ కాకుండా కొంత మంది దూరంగా ఉండిపోయారు. అది అక్కడో ఇక్కడో కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే కనిపించిన పరిస్థితి. ఉద్యోగానికి ఎంపికై కూడా పదుల సంఖ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాకపోవడంపై ఆశ్చర్యం నెలకొంది.

    సర్కార్ ఉద్యోగం కోసం గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సిటీకి వచ్చి మరీ కష్టపడుతుంటారు. ఏళ్లుగా ఖర్చులు చేస్తూ.. నిద్రాహారాలు మాని కష్టపడి చదువుతారు. అయితే.. ప్రభుత్వ కొలువు దక్కినా కొందరు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చేయడం ఇష్టం లేకనో.. ఆ కొలువులు లేకనో కానీ నియామక పత్రాలు అందుకున్న చాలా మంది ఇప్పటికీ జాయిన్ కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.

    టీజీపీఎస్సీ ద్వారా రాష్ట్ర నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)ల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో భాగంగా మొత్తంగా 687 మంది ఎంపికయ్యారు. 674 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారంతా నియామకపత్రాలు అందుకున్నారు. మిగిలిన 13 మంది మాత్రం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వలేదు. నియామకపత్రాలు అందుకున్న వారు ఈనెల 25 నాటికి పోస్టింగ్ వచ్చిన చోట రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 310 మంది మాత్రమే రిపోర్టు చేశారు. గత నెల 26న నియామక పత్రాలు అందజేయగా.. రిపోర్టు చేయడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. యువ ఇంజినీర్లకు తొలి పోస్టింగును గ్రామీణ ప్రాంతాల్లోని ఇస్తామని, ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురావద్దని రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చే సమయంలో చెప్పారు. అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

    ఇక. హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో 10 మంది ఏఈఈలకు పోస్టింగ్ ఇస్తే ఇప్పటికీ 9 మంది రిపోర్టు చేశారు. మహబూబ్‌నగర్ సీఈకి 48 మందిని కేటాయిస్తే కేవలం 8 మంది రిపోర్టు చేశారు. ఇక నల్లగొండ సీఈకి 76 మందిని కేటాయిస్తే 49 మంది, సూర్యాపేటకు 32 మందిని కేటాయిస్తే కేవలం ఇద్దరు మాత్రమే రిపోర్టు చేశారు. ఆదిలాబాద్ సీఈకి 24 మందిని కేటాయిస్తే 15 మంది, వనపర్తికి 53 మందిని కేటాయిస్తే 16 మంది, వరంగల్‌కు 30 మందిని కేటాయిస్తే కేవలం ఏడుగురు మాత్రమే రిపోర్టు చేశారు. అలాగే.. గజ్వేల్ పరిధిలో 72 మందిని కేటాయిస్తే 12 మంది, కరీంనగర్ సీఈకి 45 మందిని కేటాయిస్తే 14 మంది మాత్రమే ఇప్పటివరకు విధుల్లో చేరారు. ఈ 8 ఎనిమిది రోజుల్లో మిగితా క్యాండిడేట్స్ విధుల్లో చేరుతారా..? లేదంటే జాబ్స్‌ను వదిలేస్తారా..? అనేది తెలియకుండా ఉంది.