Maharastra BJP : మహారాష్ట్రలో బీజేపీ గెలుస్తుందా? ఎలా ముందుకెళుతుంది? ప్లాన్ ఏంటి?

గత పార్లమెంట్ ఎన్నికల వేళ చావు తప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా బీజేపీ విజయం సాధించింది. 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అతికష్టం మీద మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన హర్యానా ఎన్నికలను మరింత చాలెంజింగ్‌గా తీసుకుంది.

Written By: Srinivas, Updated On : October 17, 2024 2:33 pm

Maharastra BJP

Follow us on

Maharastra BJP : కాంగ్రెస్ అంటే అదృష్టానికి ఆమడ దూరం అని అనాలేమో. గత హర్యానా ఫలితాలను చూస్తే ఇలానే చెప్పాల్సి వస్తుంది. గత నెలల జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బ తగిలింది. అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని వెల్లడించాయి. అక్కడ కీలక సామాజికవర్గాలైనటువంటి జాట్లు, ఎస్సీ, ఎస్టీలు సిట్టింగ్ ప్రభుత్వం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే ఫలితాలు మారబోతున్నాయని చెప్పాయి. కానీ.. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఫలితాల సమయంలోనూ మొదట్లో కాంగ్రెస్ ట్రెండ్ కొనసాగినప్పటికీ.. ఆ తరువాతి పరిణామాలు ఉల్టాపల్టా అయ్యాయి. ఫైనల్లీ బీజేపీ అధికారం చేపట్టింది.

గత పార్లమెంట్ ఎన్నికల వేళ చావు తప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా బీజేపీ విజయం సాధించింది. 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అతికష్టం మీద మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన హర్యానా ఎన్నికలను మరింత చాలెంజింగ్‌గా తీసుకుంది. దాంతో సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా తమదే అధికారం అని బీజేపీ కుండబద్దలు కొట్టింది. అయితే.. హర్యానా ఎన్నికల్లో పాజిటివ్ ఫలితాలు సాధించిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలను ఎదుర్కోబోతోంది. వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది. దేశం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తయితే.. మహారాష్ట్ర ఒక ఎత్తని చెప్పక తప్పదు. ఇక్కడి రాజకీయాలు చాలా డిఫరెంట్. ఒక్కో పార్టీలో రెండేసి వర్గాలు కనిపిస్తుంటాయి.

ఇప్పటికే ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అటు శివసేన కూడా రెండుగా విడిపోయింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉందని చెప్పాలి. పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక్కడ హిందువులు కూడా మూడుగా చీలిన దుస్థితి ఉంది. అలాగే.. మైనార్టీలు కూడా అలానే చీలిపోయారు. దాంతో ఇక్కడి ప్రభుత్వం మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అని చెప్పడం కూడా చాలా కష్టతరంగా మారింది. శివసేన కార్యకర్తలు ఏక్‌నాథ్ షిండేపై చాలా సీరియస్‌గా ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే సామర్థ్యంపై వారికి అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో పరిస్థితులు అంత అనుకూలంగా లేవనేది స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ శరద్ పవార్ విషయంలో చాలా వరకు సానుభూతి కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను రాజకీయ వారసుడిగా అన్నివిధాలుగా శరద్ పవార్ ప్రోత్సహిస్తే వెన్నుపోటు పొడిచారని ప్రచారం చేసేందుకు సుప్రియా సూలె సిద్ధంగా ఉన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సైతం మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి చాన్స్ కోల్పోవద్దని పట్టుదలతో ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతూ మహారాష్ట్ర నేతలకు అండగా నిలిచేందుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్, దినేష్ గుండూరావు మహారాష్ట్రలో పార్టీ విజయం కోసం రూట్ మ్యాప్ రెడీ చేసినట్లు సమాచారం. శివసేనతో పొత్తు విషయంలో అవసరమైతే మెజార్టీ సీట్లను సైతం వదులుకునేందుకు సిద్ధమైంది. 288 సీట్లు ఉండగా.. ఇప్పటికే 225 స్థానాల్లో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది.

అయితే.. ప్రత్యర్థుల ఎత్తులకు చెక్ పెట్టేందుకు బీజేపీ సైతం మహారాష్ట్ర ఎన్నికలను చాలా ప్రాధాన్యతగా తీసుకుంది. పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్లను ఇన్చార్జిలుగా నియమించి పార్టీ గెలుపులో భాగస్వాములను చేయాలని ప్లాన్ చేసింది. అటు తమ అనుబంధమైన ఆర్ఎస్ఎస్‌ను కూడా రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. ఎక్కడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆర్ఎస్ఎస్ ముందుగానే అక్కడికి చేరుకుంటుంది. అక్కడ సర్వేలు చేపట్టి ఫైనల్ రిపోర్టను అధిష్టానానికి అందజేస్తాయని టాక్. దానికి అనుగుణంగానే అధిష్టానం అక్కడి వ్యతిరేక పరిస్థితులను సానుకూలంగా మలచుకునేందుకు ప్లాన్ చేయడం సాధారణం.ఇప్పటికే వారి సర్వే కూడా పూర్తయి రిపోర్టు అధిష్టానం పెద్దలకు చేరినట్లుగానూ సమాచారం.