Telangana Govt: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వీరికి రూ.2.5 లక్షల రుణం..

తెలంగాణలోని ప్రతి గ్రామంలో మీసేవ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్ వాడీ సెంటర్ వంటి వాటిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

Written By: Chai Muchhata, Updated On : June 29, 2024 4:19 pm

Telangana Govt

Follow us on

Telangana Govt: తెలంగాణ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి కోసం రూ.2.5 లక్షల రుణం ఇవ్వనుంది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం మీసేవ సెంటర్లు ఏర్పాటు చేసుకునేవారికి మాత్రమే. మీసేవ సెంటర్ల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు అందించబడుతున్నాయి. ఇప్పుడున్న కేంద్రాలు సరిపోవడం లేదు. ఏదైనా దరఖాస్తు సమయంలో మీ సేవ సెంటర్ల వద్ద రద్దీ ఎక్కువవుతోంది. ముఖ్యంగా మండల కేంద్రాల్లో ఉన్న సెంటర్ల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. దీంతో ఏదైనా ప్రభుత్వ పని కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. అదేంటంటే?

తెలంగాణలోని ప్రతి గ్రామంలో మీసేవ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్ వాడీ సెంటర్ వంటి వాటిల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ మీసేవ సెంటర్లను నడిపే బాధ్యత మహిళలకు ఇవ్వనున్నారు. అంతేకాకుండా మీ సేవ సెంటర్లను ఎలా నిర్వహించుకోవాలో ముందుగానే శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తరువాత వీరు మీ సేవ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తారు.

ఇంటర్ పాసైన మహిళలు మీసేవ సెంటర్లను నడిపే బాధ్యతను తీసుకుంటారు. అయితే వీరు స్వయం సహాయక సంఘాల సభ్యులై ఉండాలి. ఈ సంఘాల్లో ఉన్న వారు అర్హత, ఆసక్తి కలిగిన వారికి ముందుగానే మీ సేవ సెంటర్ల నడిపే విధంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన వరువాత మీ సేవ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి రూ.2.50 లక్షల రుణాలు అందిస్తారు. వీటి ద్వారా ఆయా గ్రామాల్లోని అంగన్ వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయాల్లో మీ సేవ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రతి గ్రామంలో మీ సేవ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల వద్దకే వెళ్లనున్నాయి. ప్రస్తుతం మండల కేంద్రాల్లో, కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రమే మీ సేవ సెంటర్లు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని సాంకేతిక సమస్యల ద్వారా అనుకున్న సేవలు అందించడం లేదు. అయితే ప్రతీ గ్రామంలో మీ సేవ సెంటర్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు తమకు కావాల్సిన పనులను గ్రామంలోనే చేసుకునే విధంగా సులభతరం చేయనున్నారు.