Amaravati: అమరావతిలో కీలక పరిణామం

అమరావతి రాజధాని లో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం భూమిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Written By: Dharma, Updated On : June 29, 2024 4:23 pm

Amaravati

Follow us on

Amaravati: అధికారంలోకి వచ్చిన మరుక్షణం చంద్రబాబు అమరావతి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రాధాన్య ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఇలా కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో.. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ముళ్ళ కంపలు తొలగించి.. రోడ్లపై లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఆగిన భవన నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఒక అధికార కమిటీ ఏర్పాటయింది. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తోంది. త్వరలో నివేదికలు అందించనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరో కీలక అడుగు పడింది. అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది.

అమరావతి రాజధాని లో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం భూమిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 1775 ఎకరాల ప్రాంతాన్ని గుర్తించిన సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిబంధనల ప్రకారం నోటిఫై ప్రక్రియ చేపడుతున్నట్టు సి ఆర్ డి ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సిఆర్డిఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం అధికారులు బహిరంగ ప్రకటన జారీ చేశారు.

అమరావతి పరిధిలో చాలా గ్రామాలను కలుపుతూ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్. రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ భవనాల కోసం గుర్తించారు. లింగాయపాలెం, శాఖమూరు, కొండమ రాజుపాలెం సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం దీన్ని నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ అయ్యింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రకటన విడుదల చేశారు. మొత్తానికైతే భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇది అమరావతికి శుభసూచికమే.