https://oktelugu.com/

TG Govt : తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్.. నేటి నుంచి అమల్లోకి..

ప్రపంచం మొత్తం 2025 ఆగమనాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నది. అన్ని దేశాల ప్రజలు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాలు మొత్తం సుభిక్షంగా ఉండడానికి ప్రధాన కారణం రైతులు. రైతులు కష్టపడి పని చేస్తేనే ప్రపంచం మొత్తం మూడు పూటలా తింటుంది. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 1, 2025 / 01:22 PM IST

    Palm oil rate Increase

    Follow us on

    TG Govt :  రైతు ప్రతి దేశానికి వెన్నెముక కాబట్టి.. రైతులు పనిచేస్తేనే ప్రపంచం ఆకలి మొత్తం తీరుతుంది కాబట్టి.. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా పామాయిల్ పంట విస్తారంగా సాగవుతోంది. గతంలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ పంట ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. రోజురోజుకు నూనె గింజల అవసరాలు పెరిగిపోవడం.. దేశ అవసరాల కోసం ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోవడం వల్ల విదేశీ మారకద్రవ్యం భారీగా తరిగిపోతోంది. ఈ క్రమంలో పామాయిల్ పంట పై దృష్టి సారించిన ప్రభుత్వం విస్తారంగా సాగు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తోంది. పంట సాగు చేసే రైతులకు రాయితీలు.. మొక్కలు.. పైపులు.. ఎరువులు.. డ్రిప్ పరికరాలు.. విద్యుత్ వంటి సదుపాయాలను అందిస్తోంది. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట విస్తారంగా సాగవుతోంది. ఈ పంట సాగుకు సంబంధించి ప్రభుత్వం ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయడంతో మరింత వేగంగా రైతులు పామాయిల్ ను తమ చేలలో వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఇప్పుడు పామాయిల్ రైతులకు నూతన సంవత్సరం సందర్భంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీ వినీ ఎరుగన్న స్థాయిలో ధరలు పెంచి రైతుల నోట్లో పంచదార పోసింది.

    టన్ను ధర పెంపు

    పామాయిల్ పంట తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా సాగవుతున్న నేపథ్యంలో.. పలు ప్రాంతాలలో ప్రభుత్వం ఉద్యాన నర్సరీలు ఏర్పాటు చేసింది. ఇక్కడ పెంచిన మొక్కలను రైతులు తమ చేలల్లో వేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. అయితే ప్రస్తుతం దమ్మపేట, అశ్వరావుపేట ప్రాంతాలలో క్రషింగ్ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పండిన పామాయిల్ పంటను రైతులు ఇక్కడికి తీసుకొస్తారు. గెలలను ఇక్కడ క్రషింగ్ చేస్తారు. ఈ క్రషింగ్ చేయగా వచ్చిన నూనెను శుద్ధిచేసి ప్రభుత్వం పామాయిల్ ను విక్రయిస్తుంది. అయితే టన్ను పామాయిల్ గెలల ధరను ప్రభుత్వం ఏకంగా 20,560 గా ప్రకటించింది. సహజంగా పామాయిల్ గెలల టన్ను ధర గతంలో ఎన్నడూ ఇంతలా పెరగలేదు. రైతులు పామాయిల్ సాగు చేయడం.. పంట ఫలాలు వస్తుండడం.. ఈ పంట సాగును మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం పెంచిన ధర బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఏడాది పరిపాలన కాలంలో రైతులకు సంబంధించిన పంట రుణాలను 21 వేల కోట్లు మాఫీ చేశామని, 7625 కోట్ల రైతు భరోసా, 3000 కోట్ల రైతు బీమా చెల్లించినట్టు ప్రభుత్వం చెబుతున్నది. రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని వెల్లడిస్తున్నది. ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పామాయిల్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.