AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే పింఛన్ల మొత్తాన్ని పెంచింది. ఉచిత గ్యాస్ పథకాన్ని సైతం అమలు చేసింది. ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించి ఒక హామీ నేటి నుంచి అమలు చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునః ప్రారంభించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* గ్రామీణ విద్యార్థులకు మేలు
రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వేలాదిమంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అంటే సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం.. సాయంత్రానికి ఇంటికి వెళ్లడం చేస్తుంటారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే గతంలో టిడిపి ప్రభుత్వం జూనియర్ కాలేజీలో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేసి చూపింది. విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. అయితే 7 నెలల కిందట కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ పథకం ప్రారంభించింది.
* నిధులు కూడా మంజూరు
తాజాగా మధ్యాహ్నం భోజనం పథకం అమలుతో లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకాన్ని ప్రారంభించడమే కాదు నిధులు సైతం మంజూరు చేసింది కూటమి సర్కార్. 2024-25 సంవత్సరానికి గాను రూ.27.39 కోట్లు, 2025-26 ఏడాదికి రూ.85.84 కోట్లు మంజూరు చేసింది కూటమి సర్కార్. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ పథకం పేరును మార్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకంగా ఖరారు చేసింది. విద్యార్థుల మెనూలో కూడా కొత్త విధానం తీసుకొచ్చింది. జోన్ల వారీగా ఈ మెనూ రూపొందించింది. ఇప్పటివరకు ఉన్నత పాఠశాలల వరకు పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేయనుండడం శుభపరిణామం.