Indiramma Houses : తెలంగాణలో పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని, అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు ఇస్తామని, స్థలం కూడా లేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని నాటి పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. దీంతో సొంత ఇంటి కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించింది. సర్వే వివరాలు ఎప్పటికప్పుడు అందులో నమోదు చేస్తోంది.
సీఎం సమీక్ష..
డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వే ఎంత వరకు వచ్చింది. సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి.. లబ్ధిదారుల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారో సమీక్ష చేశారు. ప్రజాపాలనలో నమోదు కాకపోవడంతో ఆన్‌లైన్‌లో వివరాలు లేని అర్హులు మరోమారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈమేరకు మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని సూచించారు. సంక్రాంతికి లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం ప్రారంభిస్తామని తెలిపారు.
విడతలవారీగా నగదు..
ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇందరమ్మ ఇళ్ల తరహాలోనే పునాది లెవల్‌లో, లెంటల్ లెవల్‌లో, స్లాబ్ లెవల్‌లో, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలా నాలుగు విడతలుగా రూ.5 లక్షలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల ఇంటి స్థలం వివరాలు, ధ్రువీకరణ పత్రాలు కూడా యాప్‌లో ఉండాలని పేర్కొంటున్నారు.
పొరపాట్లు లేకుండా..
లబ్ధిదారుల ఎంపికకు ఇక సర్వే కీలకం కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని గృహనిర్మాణ సంస్థ ఎంఈ గౌతం కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదేనా, కాదా అనే విషయం పరిశీలించాలని సూచించారు. యాప్‌లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం ఏశారు. 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో మరోసారి పరిశీలన ఉంటుందని తెలిపారు.
తొలి విడత 4.50 లక్షల మందికి
తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందిని ఎంపిక చేçస్తుంది. వీరు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత ఎంపిక చేసిన లబ్ధిదారుల కోసం రూ.7,740 కోట్లు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ ఆర్థికసంవత్సరంలోనే లబ్ధిదారుల ఎంపిక చేసి ఇళ్లుకు నిధులు కేటాయిస్తుంది.