TG High Court : తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందుకు రూ.లక్ష కోట్లు వెచ్చించింది. ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, మల్లన్నసాగర్‌తోపాటు అనేక బ్యారేజీలు నిర్మించింది. నీటిని లిఫ్ట్ చేసేందుకు భారీ మోటార్లు బిగించింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. రెండేళ్లు నీటిని లిఫ్ట్ చేశారు. కానీ, గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఆగస్టులో ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, నాసిరకంగా, ప్రణాళిక లేకుండా నిర్మించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణం. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని సామాజిక కారయకర్త రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 2024,సెప్టెంబర్ 5, అక్టోబర్ 17న కోర్టు విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్లు వేశారు.
విచారణకు ముందు హైకోర్టుకు..
మరో రెండు రోజుల్లో భూపాలపల్లి కోర్టులో విచారణ జరనుంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టు తులుప తట్టారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో విచారణ నిలిపివేయాలని కోరారు. తమకు కోర్టు జారీ చేసిన నోటీసులను సవాల్ చేశారు. దీంతో మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రైవేటు పిటిషన్‌పై కేసీఆర్, హరీశ్‌రావు డిసెంబర్ 27న భూపాలపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించారు.
ఇద్దరికీ ఊరట..
మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు భూపాలపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీనితో ప్రజాధనం వృథా అయిందని రాజలింగం పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలు సక్రమంగా లేవని సస్పెండ్ చేసింది. పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. కౌంటర దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపలి విచారణ జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కేసీఆర్, హరీశ్‌రావుకు ఊరట దక్కింది.