Telangana Elections : భూమి, ఇల్లు, ఇతర స్థిరాస్తి కొనుగోలులో ఒప్పందం మేరకు చెల్లింపులకు తీసుకెళ్తున్న నగదు హవాలా కింద సీజ్. పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులకు చేబదులుగా తీసుకున్న డబ్బు వెంట ఉన్నా సీజ్.. చివరకు పెద్దమొత్తంలో నగదు పట్టుకున్నట్లుగా పేరు. అయితే, ఎన్నికల వేళ పోలీసులు చేపడుతున్న ఈ తనిఖీలు సామాన్యులకు మాత్రం ఇబ్బందికరంగా మారుతున్నాయి. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునే పేరిట వారి చర్యలు ప్రజలను కష్టపెడుతున్నాయి. దీంతో పట్టుకున్నదంతా హవాలా డబ్బేనా..? సమస్యలను కనీసం అర్థం చేసుకోరా? అంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా రుజువులు కలిగి ఉండాలి. దీనిపై చాలామంది ప్రజలకు అవగాహన లేదు. ఇలాంటివారి వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు, ఇతర అవసరాలకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నవారు, ఆస్పత్రుల్లో బిల్లులు చెల్లించేందుకు డబ్బు వెంట తెచ్చుకుంటున్నవారు ఊహించని పరిణామానికి ఆందోళనకు గురవుతున్నారు.
కూడబెట్టుకున్న సొమ్మును పట్టుకుంటే ఎలా?
ఇటీవల ఆస్పత్రి బిల్లు చెల్లింపునకు అప్పు చేసి తీసుకెళ్తున్న డబ్బును స్వాధీనం చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధమే అయినా.. సాధారణంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొంత మొత్తం లెక్కల్లో ఉండదు. ఈ క్రమంలో పైసాపైసా కూడబెట్టి ఆస్తి కొనుగోలుకు వెళ్తుంటే దానిని పట్టుకుంటే ఎలా? అని ప్రజలు వాపోతున్నారు. అవసరాలకు డబ్బు తీసుకెళ్తున్నవారి పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గుర్తించాలని కోరుతున్నారు. డబ్బు ఏ అవసరానికి తీసుకెళ్తున్నారో నిర్ధారించుకునే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. చేతిలో ఉన్న మొత్తానికి చాలా సందర్భాల్లో లెక్క చూపడం సాధ్యం కాదనే విషయం అర్థం చేసుకుని వ్యవహరించాలని విన్నవిస్తున్నారు.
పార్టీలు, నాయకుల డబ్బు సురక్షితం..
సామాన్య ప్రజల కష్టాలు ఇలా ఉంటే.. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రధాన రాజకీయ పార్టీలు, నేతలు కోట్ల రూపాయలను అనుచరులతో సురక్షిత ప్రదేశాలకు చేర్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కంటికి కనపడకుండా జరిగిందని.. దీనిపై కనీస నిఘానే లేదన్న విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు పట్టుకున్న డబ్బు ఏ పార్టీ, నాయకుడికి సంబంధించినది కాదనే సంగతిని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. తనిఖీల పేరుతో ప్రధాన రోడ్లతో పాటు చిన్న దారుల వెంట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో కూడళ్ల వద్ద, యూ టర్న్ తీసుకునే దగ్గర చాలా సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.