Telangana Cabinet Decisions
Telangana Cabinet : లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ.. తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం(మే 20న) మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. దాదాపు నాలుగ గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, రైతులకు బోనస్‌తోపాటు పలు అంశాలపై చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ వేడుకలకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక యాసంగి ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కాలేజీల్లో చేపట్టాల్సిన పనులపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్లకు ధాన్యం కొనుగోలు బాధ్యత..
ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యతను కలెక్టర్లకే అప్పగించాలని కేబినెట్ నిర్ణయంచింది. రైతులకు నష్టం జరుగకుండా చివరి గింజ వరకు కొనాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించారు. ఎన్డీఎస్‌ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
సన్న వడ్లకే బోనస్..
ఇక వచ్చే ఖరీఫ్ నుంచి సన్న వడ్లు పండిచే రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొనాలని నిర్ణయించారు. రాష్ట్రానికి అవసరమైన బియ్యం మొత్తాన్ని రాష్ట్రంలోనే సేకరించాలని తీర్మానించారు. నకిలీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.600 కోట్లు కేటాయింపు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సమీక్ష చేశారు.