Teenmar Mallanna New Party: తీన్మార్ మల్లన్న మరోసారి వార్తల్లో నిలిచారు. తన క్యూ న్యూస్ ద్వారా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. మల్లన్న చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మల్లన్న కార్యాలయం పై దాడులు చేశాయి. ఈ క్రమంలో మల్లన్న అంగరక్షకుడు గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో ఆ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో కలకలాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల జాగృతి వర్గాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులోకి గులాబీ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ… కవితకు పార్టీ నుంచి పెద్దగా మద్దతు రాలేదు. ఇది ఒక రకంగా ఆమెకు మైనస్ గా మారింది. అయినప్పటికీ ఆమె తెరపైకి వచ్చి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ డిజిపి కి ఫిర్యాదు చేశారు.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
కవిత అనుచరులు చేసిన దాడులను తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. తన కార్యాలయంపై దాడి చేసే అధికారం వారికి ఎక్కడిదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రశ్నించే గొంతుకలను ఇలానే ఇబ్బంది పెడతారా అని మల్లన్న ప్రశ్నించారు. అప్పుడు కాదు ఇప్పుడు కూడా కంచం పొత్తా, మంచం పొత్తా అంటానని మల్లన్న తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. అంతేకాదు తెలంగాణ డిజిపి కి ఆయన ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి పట్ల ఉపేక్షించకూడదని, ఉదారత ఏమాత్రం చూపించకూడదని తీన్మార్ మల్లన్న ఆ ఫిర్యాదులో కోరారు. పనిలో పనిగా తీన్మార్ మల్లన్న తన కొత్త రాజకీయ పార్టీ ప్రస్తావనను తీసుకొచ్చారు. బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నట్టు మల్లన్న వ్యాఖ్యానించారు.
బీసీల కోసం గతంలోనే తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న రిజిస్టర్ చేయించారు. 2023 ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. కానీ ఆయన పార్టీ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైగా ఆయన కాంగ్రెస్ నుంచి శాసనమండలికి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేష్ రెడ్డి పై విజయం సాధించారు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆయన తన ప్రశ్నించే తత్వాన్ని వదులుకోలేదు. ఎమ్మెల్సీగా గెలిచిన కొద్దిరోజుల వరకు తీన్మార్ మల్లన్న సగటు కాంగ్రెస్ నాయకుడు గానే ఉన్నారు. ఆ తర్వాత కుల గణన విషయంలో ప్రభుత్వంతో విభేదించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో సీనియర్ నాయకులు తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదులు చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకుల డిమాండ్ కు తలవంచిన పార్టీ అధిష్టానం తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ సస్పెండ్ నేతగానే తీన్మార్ మల్లన్న ఉన్నారు. బీసీల కోసం పార్టీ పెడతానని చెబుతున్న తీన్మార్ మల్లన్న గతంలో రిజిస్టర్ చేయించిన తెలంగాణ నిర్మాణ పార్టీని ఉంచుతారా.. లేక కొత్త పార్టీ పేరును ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంది.