Group 1 Mains: గ్రూప్ -1 మెయిన్స్ విషయంలో గత కొద్దిరోజులుగా తెలంగాణలో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అశోక్ నగర్ ప్రాంతంలో కొంతమంది అభ్యర్థులు నిరసనలు చేపట్టడం.. దానికి భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ సహకరించడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఆడలేదు. జీవో 55 ప్రకారం పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరుతుంటే.. జీవో 29 ప్రకారం నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి నేరుగా ప్రభుత్వాన్ని టాకిల్ చేసింది. ఈ సీన్లోకి బిజెపి కూడా ఎంటర్ అయింది. తక్షణమే జీవో 29 ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఈ కేసును సోమవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. గ్రూప్ -1 అభ్యర్థుల తరఫున భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో కేసు వాదించారు. ఈ క్రమంలో పూర్వాపరాలను విన్న సుప్రీంకోర్టు మెయిన్స్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లిన తర్వాత తాము ఎలా జోక్యం చేసుకుంటామని పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పు భారత రాష్ట్ర సమితికి, కొంతమంది గులాబీ అనుకూల అభ్యర్థులకు మొట్టికాయ లాగా మారింది. ప్రభుత్వానికి మాత్రం చాలా వరకు ఉపశమనాన్ని ఇచ్చింది.
రేవంత్ మొండి వైఖరి
తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్స్ యధావిధిగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి మొదటి నుంచి మొండి పట్టుదలతో ఉన్నారు.. ఇటీవల కొంతమంది అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే రేవంత్ పై ప్రతిపక్షాల విమర్శలు చేశాయి. గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండ్లర్స్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాయి. ఇష్టానుసారంగా విమర్శలు చేశాయి. అయితే తాను చేస్తున్న పని నిజాయితీతో కూడుకున్నప్పుడు.. ఎవరు ఎలాంటి ఆందోళనలకు పాల్పడినప్పటికీ వెనకడుగు వేయకూడదని రేవంత్ రెడ్డి నమ్మారు. ఒకవేళ గనుక పది మంది చేసే ఆందోళన చూసి వెనక్కి తగ్గితే.. ప్రభుత్వంపై ప్రతీ ఒక్కరు సవారీ చేస్తారని రేవంత్ రెడ్డి భావించారు. అందువల్లే ఎటువంటి ఆందోళనలు జరిగినప్పటికీ.. వారి వెనుక రాజకీయ పార్టీలు ఎలాంటి లక్ష్యంతో పనిచేసినప్పటికీ.. రేవంత్ భయపడలేదు. పైగా పలు సందర్భాల్లో జీవో 29 ప్రకారమే మెయిన్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-1 పై జరుగుతున్న ఆందోళనలు మొత్తం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని మొదటి నుంచి రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. ఆందోళనలో పాల్గొనేవారిలో సగం మంది కూడా గ్రూప్ -1 మెయిన్స్ రాసే అభ్యర్థులు కారని రేవంత్ రెడ్డికి తెలుసు. తన ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారని రేవంత్ రెడ్డి అంచనా వేశారు. అందువల్లే ఆయన మెయిన్స్ నిర్వహణకే మొగ్గు చూపించారు. గ్రూప్ -1 కోసం పది సంవత్సరాలపాటు తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూశారు. వాయిదాలు, కోర్టు కేసుల అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ నిర్వహణకు మార్గం సుగమం అయింది. వాస్తవానికి పరీక్షలను వాయిదా వేయాలని ఏ అభ్యర్థులు కూడా కోరుకోరని ప్రభుత్వ వర్గాల వాదన. పైగా అభ్యర్థుల వెనుక భారత రాష్ట్ర సమితి నాయకులు ఉండడంతో వారి లక్ష్యం ఏమిటో ప్రభుత్వానికి అర్థమైంది. అందువల్లే మెయిన్స్ నిర్వహణ వైపే మొగ్గుచూపింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఏ కార్యక్రమమైనా రాజకీయమే అవుతుంది. భారత రాష్ట్ర సమితి తన అనుకూల మీడియా ద్వారా వ్యతిరేక కథనాలను ప్రసారం చేయిస్తోంది. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తుల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా ప్రచారం చేయిస్తుంది. ఇటీవల దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగితే.. దానివల్ల అనంతగిరి కొండలు మొత్తం నాశనమైపోతాయని భారత రాష్ట్ర సమితి ప్రచారం చేయించింది. చివరికి గ్రూప్ -1 విషయంలోనూ వాస్తవాలను పక్కనపెట్టి.. అబద్దాలను ఎక్కువగా ప్రచారం చేశారని.. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లారని.. గ్రూప్ -1 మెయిన్స్ ను కూడా అలాగే డీల్ చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు భారత రాష్ట్ర సమితికి మొట్టికాయలాగా..రేవంత్ ప్రభుత్వానికి ఎర్ర తివాచి లాగా మారిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Supreme courts sensational decision on group 1 mains what will revanth reddy do
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com