Supreme Court : హైదరాబాద్ నగరంలోని కంచె గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాలను అభివృద్ధి చేసి.. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 400 ఎకరాలను చదను చేసే పనిని మొదలుపెట్టింది. అయితే ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనివని..ఈ భూములలో ఉన్న చెట్లను తొలగిస్తే.. వాటి ఆధారంగా బతుకుతున్న వన్యప్రాణులు ఆగమైపోతాయని విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టారు. వారి ఆందోళనకు రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించాయి. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే #saveHCU అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.. ఆ 400 ఎకరాలను చదును చేయడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని.. వన్యప్రాణులు ఆవాసాన్ని కోల్పోతాయని పర్యావరణవేత్తలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులయితే ఏకంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఈ విషయంపై కొందరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణకు స్వీకరించింది. గురువారం కీలకతీర్పును వెల్లడించింది.
Also Read : హెచ్‌సీయూ భూముల వివాదం.. ఒక్క చెట్టు నరకొద్దని సుప్రీం కోర్టు ఆదేశం
సుప్రీంకోర్టు స్టే
కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేత పై సుప్రీంకోర్టు స్పందించింది. గురువారం మధ్యాహ్నం కీలకతీర్పును వెల్లడించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఆ ప్రాంతంలో చెట్లను నరికి వేయకూడదని.. ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ” ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. చట్టాన్ని మీరు చేతుల్లోకి ఎలా తీసుకుంటారు.. అంతా మీ ఇష్టమేనా.. అంతటి సున్నిత ప్రాంతంలో చెట్లను నరికివేయాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది.. అభివృద్ధి చేయాలనుకుంటే ఇతర ప్రాంతాల్లో భూములు లేవా.. హైదరాబాద్ నగరం మరింతగా విస్తరిస్తోంది కదా.. అలాంటప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా ఇలానే అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా.. ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయలేదు.. బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతంలోనే మీరు అభివృద్ధి చేస్తామని ఎలా చెబుతున్నారు.. మాకు హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికలో చెట్లు ఉన్నాయని ఉంది. అక్కడ పక్షులు, ఇతర జంతువులు కూడా నివాసం ఉంటాయని ఉంది. అలాంటప్పుడు మీరు అక్కడ అలాంటి చర్యలు ఎలా తీసుకుంటారు.. చెట్లను తొలగిస్తే ఆ జంతువులు ఎక్కడికి వెళ్తాయి.. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా” అంటూ సుప్రీంకోర్టు మండిపడింది. ఈ పరిణామం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. సుప్రీం కోర్టులో సంచలన పరిణామం