HomeతెలంగాణSummer Effect in Yadadri : యాదాద్రీషా.. ఇంతలా మాడు పగలగొట్టేస్తున్నావేంటయ్యా

Summer Effect in Yadadri : యాదాద్రీషా.. ఇంతలా మాడు పగలగొట్టేస్తున్నావేంటయ్యా

Summer Effect in Yadadri : ఒక వైపు ఎండ మోత.. మరోవైపు సౌకర్యాలు లేక యాదాద్రిలో భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో యాదాద్రి లక్ష్మనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తు భక్తులు తరలివస్తున్నారు. కానీ 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో యాదాద్రి నిప్పులకొలిమిలా మారుతోంది. ఎండకు కృష్ణ శిలలతో నిర్మించిన ప్రధానాలయం, దాని పరిసరాలు వేడెక్కుతుండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

తెలంగాణ సర్కారు ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకూ పనులు కొలిక్కి రాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానాలయంలో సెంట్రలైజ్డ్ ఏసీని ఏర్పాటుచేశారు. దీంతో లోపల ఉన్నంత వరకూ భక్తులకు ఇబ్బందులు లేవు. కానీ దర్శన అనంతరం బయటకు వస్తున్న వారు ఒక్కసారిగా ఉష్ణతాపాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రసాదాల కొనుగోలుకు, శివాలయానికి వెళ్లడానికి, కొండపైన బస్టాండ్‌కు వెళ్లడానికి కాలినడకన వెళ్లాల్సిన ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి.
స్వామివారి దర్శనం చేసుకోవడానికి చెప్పులు విడిచిపెట్టి వెళుతున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దర్శనం అనంతరం కాలే కాళ్లతో చెప్పులు వేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. అటు చిన్నారులు, వృద్ధులు పడుతున్న బాధ వర్ణనాతీతం. కాలుతున్న నేలపై నడిచేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. చివరకు కాళ్లకు సాక్సులు మాదిరిగా టవాళ్లను కట్టి ఆలయ ప్రాంగణంలో నడవాల్సి వస్తోంది.
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినా దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం భక్తులకు నిలువనీడ లేకపోవడంపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కనీసం చలువ పందిళ్లు, జూట్‌ మ్యాట్‌లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. అక్కడక్కడా కూల్ పెయింట్ వేసి చేతులు దులుపుకున్నారు. వేసిన కొద్దిపాటి జ్యూట్‌ మ్యాట్‌లపై వాటిపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లడంలేదు. మంచినీటి నల్లాల వద్ద ఎలాంటి నీడ లేకపోవడంతో వాటి నుంచి చల్లని నీటికి బదులు వేడి నీరు వస్తోంది. దీంతో కొండపైన నీటి వ్యాపారం జోరందుకుంది.రూ.20 వాటర్ బాటిల్ రూ.30కి విక్రయిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి తెలియని భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చి చిక్కుతున్నారు.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular