Srushti Fertility Hospital Case: ఆ మధ్య తెలంగాణలో అక్రమ సరోగసి.. చిన్నపిల్లల అమ్మకం.. చిన్నారుల అక్రమ రవాణా వంటి అభియోగాలతో.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు సంబంధించి ఇప్పుడు మరొక విషయం వెలుగులోకి వచ్చింది. అది కాస్త ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులకే దిమ్మతిరిగేలా చేస్తోంది.
అక్రమ సరోగసి, చిన్నపిల్లల అక్రమ రవాణా, చిన్నారుల అమ్మకం వంటి అభియోగాలతో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పై రకరకాల కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దర్యాప్తు బదులు పెట్టింది పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కీలక విషయాలను బయటపెట్టింది.. సరోగసి పేరుమీద పిల్లల అక్రమ రవాణా.. మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో వేగంగా 500 కోట్ల లావాదేవీలను ఈ సంస్థ జరిపినట్టు గుర్తించింది. అదే కాదు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నమ్రత మొదట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సక్రమంగా నిర్వహించినప్పటికీ.. ఆ తర్వాత డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కినట్టు సమాచారం. పేద మహిళలను టార్గెట్ చేసి వారిద్వారా సరోగసి నిర్వహించే వాళ్ళని.. పిల్లలను అక్రమంగా రవాణా చేసే వారిని.. సంతానం లేని దంపతులను టార్గెట్గా చేసుకొని.. పిల్లలు ఇస్తామని చెప్పి భారీగా దండుకునేవారని వెలుగులోకి వచ్చింది. అంతేకాదు వసూలు చేసిన డబ్బులు మొత్తం అక్రమ మార్గంలో వివిధ ప్రాంతాలకు తరలించారని సమాచారం.
ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సృష్టి వ్యవహారం మరింత సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. నమ్రత వెనుక ఎవరున్నారు? ఇలా వసూలు చేసిన డబ్బులను ఆమె ఏం చేశారు? ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు? ఆమెకు బినామీలుగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు అనే కోణాలలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ జరుపుతున్నారు. మొత్తంగా చూస్తే సృష్టి వ్యవహారం సాదాసీదా కేసు కాదని.. ఇందులో అనేక సంచలన విషయాలు ముడిపడి ఉన్నాయని తెలుస్తోంది.