Five BRS MLAs: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది.. ఇప్పుడు ఇదే మాటను గులాబీ పార్టీ నాయకులు పదేపదే పునఃశ్చరణ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఆ విధంగా ఉంది మరి. తెలంగాణ రాష్ట్రంలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేపట్టిన తర్వాత కొంతమంది గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మూడు రంగుల కండువా కప్పుకున్నారు. దీనిని సవాల్ చేస్తూ గులాబీ పార్టీ నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. అనేక దఫాలుగా విచారణ జరిగిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను న్యాయస్థానాలు ఆదేశించాయి.
తెలంగాణ శాసనసభ సభాపతి ఎట్టకేలకు ఆ ఎమ్మెల్యేల వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన తీర్పును సైతం వెల్లడించారు. తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్ లను ఆయన కొట్టివేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపించలేకపోయారని స్పీకర్ ఆ తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటు వేయడానికి ఆధారాలు లేవని, సాంకేతికపరంగా ఆ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో ఉన్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ తన తీర్పులో పేర్కొన్నారు.
పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను దాఖలు చేశారు. ఇందులో 8 మందికి సంబంధించి విచారణ పూర్తయింది.. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన పిటిషన్ లపై ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. శాసనసభాపతి ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టులో ఏకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 19న మరోసారి ఆ ఎమ్మెల్యేలపై విచారణ సాగించే అవకాశం కనిపిస్తోంది. బుధవారం 8 మందిపై విచారణ పూర్తి చేశారు తెలంగాణ శాసనసభ స్పీకర్. ఐదుగురికి సంబంధించి కీలక తీర్పును వెల్లడించారు. కాల యాదయ్య, సంజయ్, శ్రీనివాస్ రెడ్డి పై గురువారం తీర్పు చెప్తారని తెలుస్తోంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పదేపదే న్యాయస్థానాల గుమ్మం తొక్కింది గులాబీ పార్టీ. వాస్తవానికి గులాబీ పార్టీ న్యాయస్థానాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని భావించింది. ఇందులో కొంతమేర విజయవంతం అయింది కూడా. కానీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ గులాబీ పార్టీకి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.