CM Revanth Reddy: కన్నతల్లిని.. పుట్టిన ఊరును.. మాతృభాషను మర్చిపోవద్దు అంటారు. కానీ నేటి కాలంలో అవన్నీ తారుమారవుతున్నాయి. కన్నతల్లిని నేటితరం పట్టించుకోవడం లేదు. ఉన్నత ఉద్యోగుల కోసం సొంత గ్రామాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక మాతృభాష గురించి నేటితరం మరిచిపోయి చాలా రోజులైంది. ఇంగ్లీషులోనే చదువుతున్నారు. ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. చివరికి ఇంగ్లీషు లేకుండా బతకలేని పరిస్థితికి చేరుకున్నారు.
ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో రామోజీ ఎక్స్ లెన్సీ అవార్డుల ప్రధానోత్సవం సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక కోరిక కోరారు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ జీవో లు.. ఇతర అధికారిక కార్యకలాపాలలో తెలుగుకు ప్రాధాన్యం పెంచాలని కోరారు. ఎందుకంటే మాతృభాష కనుమరుగైపోతుంటే అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదని.. మాతృభాష మనగడలో లేకపోతే ఆ జాతి అంతరించిపోయినట్టేనని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెంకయ్య నాయుడు మాటలతో ఏకీభవించారు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పరిపాలనలో తెలుగుకు ప్రాధాన్యమిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అయితే రేవంత్ ఆ మాటను అక్కడితోనే వదిలేసారని చాలామంది అనుకున్నారు. కానీ మూడు రోజుల వ్యవధిలోనే రేవంత్ ఆ మాటను గుర్తు పెట్టుకొని అమలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేస్తోంది. ఇందిరా గాంధీ జయంతి రోజు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ గురించి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఇలా మాట్లాడుతుండగా సిరిసిల్ల కలెక్టర్ వంతు వచ్చింది. సిరిసిల్ల కలెక్టర్ గా గరీమ అగర్వాల్ కొనసాగుతున్నారు. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డి అడ్డు తగలారు. ఇక్కడ ఉన్న వారంతా సామాన్య మహిళలని.. అలాంటప్పుడు ఇంగ్లీషులో మాట్లాడితే వారికి అర్థం కాదని.. తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశంతో గరీమ తెలుగులో మాట్లాడారు.
కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన విషయంలో తెలుగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా తెలుగువారిని.. తెలుగు భాషతో సంబంధం ఉన్న వారిని నియమిస్తున్నారు. పాలనకు గుండెకాయ లాంటి విభాగాలలో ఇప్పటికే చాలామందిని తెలుగువారిని తీసుకున్నారు. భవిష్యత్తు కాలంలో తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడానికి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ఇదే గనుక వాస్తవ రూపం దాల్చితే రేవంత్ రెడ్డి ఎక్కడికో వెళ్లిపోతారని తెలుగు భాషాభిమానులు పేర్కొంటున్నారు.
