https://oktelugu.com/

Telangana Railway : తెలంగాణ రైల్వేకు మరో గొప్ప వరం.. ఇక రద్దీకి చెక్.. రైల్వే జంక్షన్ పై కీలక నిర్ణయం*

తెలంగాణలో రైళ్ల రద్దీ పెరుగుతోంది. తెలంగాణకు కొత్త రైళ్లు కేటాయించకపోయినా.. తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు మరో రైల్వే జంక్షన్‌ ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 16, 2024 / 06:14 PM IST

    Vishnupuram railway station

    Follow us on

    Telangana Railway : తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధిపై భారత రైల్వే దృష్టిపెట్టింది. గడిచిన పదేళ్లలో రైలుమార్గాల విస్తరణ, విద్యుదీకరణ, మూడో లైన్‌ పనులు చేస్తోంది. కొత్త రైలు మార్గాలను కూడా ప్రతిపాదించింది. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం మూడు రైల్వే స్టేషన్లతోపాటు కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ కూడా అందుబాటులోకి వస్తుంది. అయినా రైళ్ల రద్దీకి అనుగుణంగా జంక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రద్దీ, భవిష్యత్‌లో పెరగనున్న రైళ్లను దృష్టిలో ఉంచుకుని మరో రైల్వే జంక్షన్‌ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు–నడికుడి మార్గంలో నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న విష్ణుపురం రైల్వే స్టేషన్‌ను రైల్వే జంక్షన్‌గా మార్చాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

    నూతన విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం..
    ఇదిలా ఉంటే.. దామచర్ల మండలం వీర్లపాలెం వద్ద 20 వేల మెగావాట్ల సామర్థ్యంలో తెలంగాణలోనే అతిపెద్ద థర్మల్‌ విద్యుత్‌ పస్లాంటును నిర్మిస్తున్నారు. దీనికి సమీపంలోనే విష్ణుపురం రైల్వే స్టేషన్‌ ఉంది. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు ప్రతీరోజు 21 వ్యాగన్ల బొగ్గు పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి సరఫరా చేయాల్సి ఉంటుంది. జాన్‌పహాడ్‌ మార్గంలో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌కు అదనంగా మరో లైన్‌ నిర్మిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని విష్ణుపురం స్టేషన్‌ను జంక్షన్‌ను చేయాలని అధికారులు ప్రతిపాదించారు.

    మూడు రైలుమార్గాలు కలిసే చోటు..
    రైల్వే జంక్షన్‌ ఏర్పాటు చేయాలంటే.. మూడు రైలు మార్గాలు ఒకేచోట కలవాలి. విష్ణుపురం వద్ద గుంటూరు–బీబీనగర్‌ రైల్వేలైన్‌ మార్గం ఒక్కటే ఉంది. దీనిని రెండు వరుసలుగా విస్తరిస్తున్నారు. మిర్యాలగూడ–గుంతకల్లు రైల్వేలైన్‌ సైతం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో రైల్లు నడిపితే రద్దీ పెరుగుతుంది. విష్ణుపురం రైల్వే స్టేషన్‌ రద్దీగా మారుతుంది. ఇక గుంటూరు–జాన్‌పహాడ్‌ లైను, వీర్లపాలెం థర్మల్‌ ప్లాంటు ట్రైన్‌ మార్గాలు సైతం ఇక్కడే కలుస్తాయి. ఈ నేపథ్యంలో ఇక్కడే జంక్షన్‌ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే జంక్షన్‌కు అవసరమైన విద్యుత్, రైల్వే సురక్షిత సౌకర్యాలు కల్పించనున్నారు.

    కవచ్‌ టెక్నాలజీ కూడా..
    రైలు ప్రమాదాల నివారణకు భారత రైల్వే సంస్థ ఇటీవలే కవచ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టెక్నాలజీని కూడా విష్ణుపురం జంక్షన్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంటుకు 5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా రైల్వే జంక్షన్‌లో అవసరమైన పనులు జరిపించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.