Sonia Gandhi: రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి.. తెలంగాణ ప్రజలకు సోనియా వినతి

తెలంగాణ ప్రచారానికి రాకపోయినా సోనియాగాంధీ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Written By: Raj Shekar, Updated On : November 29, 2023 7:45 am

Sonia Gandhi

Follow us on

Sonia Gandhi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. పోలింగ్‌కు రెండు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే తెరపడింది. 30వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 199 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణతోపాటు ఎన్నికలు నిర్వహించే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలలో ఇప్పటికే పోలింగ్‌ పూర్తయింది. ఈ రాష్ట్రల కౌంటింగ్‌ కూడా డిసెంబర్‌ 3న జరుగుతుంది. చివరి రోజున కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో సోనియాగాంధీ రావడం లేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

వీడియో సందేశం..
తెలంగాణ ప్రచారానికి రాకపోయినా సోనియాగాంధీ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం బలిదానాలను ఇచ్చిన వారి కలను సాకారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తనకు అమ్మ స్థానాన్ని ఇచ్చారని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అని నినదించారు. జై తెలంగాణ అంటూ ముగించారు.