దేశంలో మద్యం ప్రియుల సంఖ్య్ రోజురోజుకు పెరిగిపోతుంది. మద్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నా మద్యం కొనుగోళ్లు తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా విజృంభణ వల్ల ఇంటికే పరిమితమైన వాళ్లు ఒత్తిడికి లోనై మద్యం తెగ తాగేస్తున్నారని సర్వేల్లో తేలుతోంది. అయితే మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం పదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మెజారిటీ వాహన ప్రమాదాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్యమే కారణం. ఈ మద్య కాలంలో హైదరాబాద్ నగరంలో మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సజ్జనార్ మాట్లాడుతూ పబ్ లో మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లకు 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తామని తెలిపారు.
గతంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినతరం చేశామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీల కోసం ఏసీపీ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని పబ్ నిర్వాహకులను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చేర్చుతామని సజ్జనార్ అన్నారు. పబ్ లో మద్యం తాగిన వాళ్లను పబ్ నిర్వాహకులు సక్రమంగా ఇంటికి చేరేలా చేయాలని చెప్పారు,
మద్యం సేవించిన వారికి వెహికిల్ ఇవ్వకూడదని పబ్ నిర్వాహకులకు సూచించారు. ప్రత్యామ్నాయ డ్రైవర్లను ఏర్పాటు చేసి మద్యం తాగిన వాళ్లు ఇంటికి క్షేమంగా చేరేలా చేయాలని సజ్జనార్ సూచించారు. ఇకపై మద్యం ప్రియులు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం 10 సంవత్సరాల జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుంది.