Land Registration: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రిజిస్ట్రేషన్లపై కీలక అప్టేట్ ఇదీ

దశలవారీగా పరిశీలన పూర్తిచేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలు చేసేలా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 2:50 pm

Land Registration

Follow us on

Land Registration: తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చార్జీలను సవరించాలని నిర్ణయించింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు అమలు చేయనుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ స్రారనంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమలులోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. జూన్‌ 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభిస్తారు.

జూలై 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు..
దశలవారీగా పరిశీలన పూర్తిచేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలు చేసేలా స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మార్గదర్శకాలు జారీ..
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే–లాయండ్‌ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో కసరత్తు ఇలా..
= జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా స్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్‌ విలువ నిర్ణయిస్తారు.

= భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు ఆ రీతులను గుర్తిస్తారు.

= వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలపై అంచనాకు వస్తారు.

పట్టణ ప్రాంతాల్లో ఇలా..
ఇక మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు–అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతేనే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు కూడా చేసే వీలు ఉంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేస్తారు.

షెడ్యూల్‌ ఇదీ..
– జూన్‌ 18న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వే అధికారులో సమావేశం.

– జూన్‌ 23న మార్కెట్‌ విలువల సవరణ పూర్తి.

– జూన్‌ 25న పునః సమీక్ష

– జూన్‌ 29న కమిటీ ఆమోదం.

– జూలై 1న వెబ్‌సైట్‌లో సవరించిన విలువల ప్రదర్శిన.

– జూలై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం.

– జూలై 31న శాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరల అప్‌డేషన్‌.

– ఆగస్టు 1 నుంచి సవరించిన ధరలు అమలు.