Hyderabad Formula E Race Case: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలను రప్పించారు. దీంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని భావించారు. కానీ, ఈ పేరుతో కేటీఆర్ గ్రీన్‌కో సంస్థకు రూ.56 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండా చెల్లించారు. దీనికి సంబంధించి రిజర్వు బ్యాంకు తెలంగాణ ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ జరిపిన ప్రభుత్వం అవకతవకలు జరిగినట్లు గుర్తించి విచారణకు అనుమతించాలని గవర్నర్‌ను కోరింది. గవర్నర్ అనుమతి రాగానే ఏసీబీ డిసెంబర్ 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కేటీఆర్ డిసెంబర్ 18న హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్ కొట్టివేత..
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు దఫాలుగా హైకోర్టు(High Court) ధర్మాసనం విచారణ జరిపింది. ఏసీబీకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయకుండా ఊరట ఇచ్చింది. అయితే ఏసీబీ కూడా అరెస్టు చేయకుండా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని కోరింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తీర్పును డిసెంబర్ 31న రిజర్లు చేసింది. తాజాగా జనవరి 6న తీర్పు వెల్లడించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. తీర్పు వెల్లడిస్తున్న క్రమంలో కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ తరఫున అడ్వకేట్ కోర్టును కోరగా, ఇలాంటి పిటిషన్లలో అవన్నీ కుదరవని స్పష్టం చేసింది. కేసు విషయంలో ఏసీబీ వాదనలనే సీరియస్గా పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.
హోరాహోరీగా వాదనలు..
ఈ కేసులో కేటీఆర్ తరఫున ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. కేటీఆర్‌పై 409 సెక్షన్ చెల్లదని వాదించారు. ఫార్ములా ఈరేస్ సందర్భంగా ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం కేటీఆర్ డబ్బులు వాడుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 409 సెక్షన్ అమలు చేస్తే దంగరగోళం నెలకొంటుందని పేర్కొన్నారు. దేశంలో ఏ మంత్రి కూడా ఫైళ్లపై సంతకాలు చేయరని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జరరల్ బాల మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తి ఆధారాలతో కోర్టులో సమర్పించారు. నోట్‌ఫైళ్లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచారు. కేబినెట్‌లో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది.