CM Revanth Reddy: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టి వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు తెగిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. జనసీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో వరదలు పోటెత్తాయి. నదులు ఉగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్ కింద ఉన్న వంతెనలు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ రహదారి కోతకు గురికావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 24 గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ధాటికి చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరదల్లో కొట్టుకుపోయి ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం.. దానిని రూ.5 లక్షలకు చెంచింది. తాజాగా రైతుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
వరద బాధితులకు అండగా..
వరద ప్రభావం తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అనంతరం మంత్రులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ సమయంలో మంత్రులంతా ప్రజల వద్ద ఉండాలని, పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం.. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేలు చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వరదలో.. బురద రాజకీయాలా?
ఇప్పటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో 16 మంది మరణించారని తెలిపారు. రూ.5,430 కోట్లు నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరద బాధితులు సర్వం కోల్పోయారన్నారు. వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. . ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు వెళ్లడం కేసీఆర్ బాధ్యత. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం కంటే ముందు ప్రతిపక్ష నేతలే వెళ్తారన్నారు. కానీ, కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే మాట్లాడతారు. కేటీఆర్ అమెరికాలో ఉండి.. ఇక్కడ మంత్రులు పట్టించుకోలేదని కేటీఆర్ ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. ప్రజలకు కష్టం వచ్చినా కేసీఆర్ స్పందించరు.. పలకరించరు. బీఆర్‌ఎస్ నేతల వైఖరి వల్ల ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముందుకొచ్చి నైతిక మద్దతు ఇచ్చారని తెలిపారు. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
ఇంతటి వరద ఎన్నడూ చూడలేదు..
ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతటి వరద చూడలేదన్నారు. వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రాణ నష్టనివారణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం ప్రాణాలు పెట్టి శ్రమించారన్నారు. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్లు అందుబాటులోకి రాలేదని తెలిపారు. సీఎం తాత్కాలిక నష్ట పరిహారం ప్రకటించారన్నారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రాజకీయాలకు సమయం కాదు..
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇంత వరద ఎప్పుడూ చూడలేదని తెలిపారు. వరదలకు రూ.వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. సీఎం కేంద్రం సాయం కోరదామన్నారని తెలిపారు. ప్రతిపక్షాలు చేతనైతే మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్ధని హితవు పలికారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More