Sarvotham Reddy Vs Patel Ramesh Reddy: ఇప్పట్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేవు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మినహా.. ఇతర ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందా? లేదా? అనేది సుప్రీంకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.. ఎన్నికలు లేకపోయినప్పటికీ.. పదవుల పందేరం లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ లో కాక రేగుతూనే ఉంది.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు కూడా. అందువల్లే పదవుల కోసం.. ఇతర ప్రయోజనాల కోసం పోటీ పడుతుంటారు.. బల ప్రదర్శన చేస్తుంటారు. అలాంటి ఇద్దరు నాయకులు ఇప్పుడు తమ బల ప్రదర్శనకు గాంధీభవన్ ను వేదిక చేసుకున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి గాంధీభవన్లో కలకలం రేపారు. ఇది అటు ప్రభుత్వానికి.. ఇటు పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని సీనియర్ నేతలు అంటున్నారు. ఈ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కార మార్గం చూపించాలని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట ఇన్చార్జి పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని దక్కించుకోవడానికి రెండు వర్గాలు పోటాపోటీగా బల ప్రదర్శన చేస్తున్నాయి. అందులో ఓ వ్యక్తి పటేల్ రమేష్ రెడ్డి కాగా.. మరొక వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి. పటేల్ రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సర్వోత్తమ్ రెడ్డి దివంగత దామోదర్ రెడ్డి కుమారుడు. సర్వోత్తమ్ రెడ్డి, రమేష్ రెడ్డి సూర్యాపేట కాంగ్రెస్ ఇన్చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. పోటాపోటీగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రమేష్ రెడ్డి ప్రస్తుతం పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ ఆశించారు. అయితే ఆయనకు నిరాశ మిగిలింది. దామోదర్ రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపించడంతో రమేష్ రెడ్డి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.. ఆ తర్వాత బుజ్జగింపులు చేపట్టి, నల్లగొండ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పడంతో రమేష్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఆ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి చేతిలో దామోదర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక ఇటీవల దామోదర్ రెడ్డి కన్నుమూయడంతో ఆయన వారసుడిగా సర్వోత్తమ్ రెడ్డి తెరపైకి వచ్చారు. సర్వోత్తమ్ రెడ్డి దాదాపుగా రాజకీయ ప్రవేశం చేసినట్టే.
ఇటీవల తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి దశదినకర్మ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డికి తాము అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సర్వోత్తమ్ రెడ్డి వర్గీయులు గాంధీభవన్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో సూర్యాపేట ఇన్చార్జి పదవి విషయంలో మరోసారి అగ్గి రాజుకుంది. ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.