
Saidabad Rapist Raju: హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యం చేసి హత్య చేసిన హంతకుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ పై అతడి మృతదేహాన్ని గుర్తించారు. రాష్ర్టంలో సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిగా ఉన్న రాజును పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన జరిగి ఆరు రోజులైనా నిందితుడిని గుర్తించడంలో ఎలా విఫలమయ్యారని ప్రశ్నించారు. రాజు ఆత్మహత్యపై సైదాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేశారు రాజుకు తగిన శాస్తి జరిగిందని పేర్కొన్నారు.
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం గురువారం ఉదయం ఎవరో రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తుండడం చూసిన రైల్వే కీమెన్లు గుర్తించి అనుసరించారు. కానీ అతడు చెట్ల పొదల్లోకి వెళ్లాడు. వారు వెళ్లి చూడగా కనిపించలేదు. కొద్దిసేపటికి కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి మరణించాడని చెప్పారు. వెంటనే వెళ్లి చూడగా అతడు రాజుగా గుర్తించారు. దీంతో అతడి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చేతిపై ఉన్న మౌనిక పేరుతో నిందితుడు రాజుగా నిర్ధారించారు.
రేపిస్ట్ రాజు చావు వెనుకాల మరో వాదన కూడా వినిపిస్తోంది. రేపిస్ట్ రాజును గుర్తించిన రైల్వే కీమెన్లు వెంబడించగా.. అతడు పారిపోయాడని.. రైల్వేలైన్ దాటుతూ రైలు కింద పడి చనిపోయాడని అంటున్నారు. స్థానికులు గుర్తించడంతోనే పరుగులు తీసి పారిపోవడానికి ప్రయత్నిస్తూ రాజు ప్రమాదవశాత్తూ చనిపోయాడని.. అతడిది ఆత్మహత్య కాదు.. ప్రమాదమేనని అంటున్నారు. ఈ మేరకు ప్రధాన మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై నిజనిజాలు తెలియాల్సి ఉంది.
ఆరేళ్ల చిన్నారిని క్రూరంగా పాడు చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఈనెల 9 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నా కంటపడకుండా తిరిగాడు. నిందితుడిని శిక్షించాలని ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో అతడిని ఎన్ కౌంటర్ చేయాలని ఒత్తిడులు పెరిగిన సందర్భంలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజును పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు ప్రకటించి పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఫొటోలు, పోస్టర్లు అంటించి ఆచూకీ కనిపెట్టాలని భావించారు. కానీ నిందితుడు మాత్రం చిక్కకుండా పారిపోయాడు. చివరికి ప్రాణాలు తీసుకుని శవంగా మరాడు. కానీ అతడి మృతిపై భార్య, తల్లి మాత్రం పోలీసుల మీదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిందితుడి ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ కూడా ట్విటర్ లో స్పందించారు. బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు.