Rythu Bharosa: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని.. సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని.. ప్రజలకు పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కలిగిస్తామని.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలోనూ.. ప్రతి సభలోనూ ఆరు గ్యారెంటీ ల గురించి ప్రచారం చేశారు. భారత రాష్ట్ర సమితి పై ఉన్న ఆగ్రహం.. పది సంవత్సరాల పరిపాలన పై విసుగు వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి 10 సంవత్సరాల తర్వాత అధికారాన్ని కట్టబెట్టారు.
సహజంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పై ప్రజలకు ఆశలు ఉంటాయి. అది కాదనలేని వాస్తవం కూడా. పైగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రకటించడంతో.. ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు రుణాల మాఫీని అమలు చేసింది. అయితే ఇందులో రుణాల మాఫీ సక్రమంగా జరగలేదని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అంతేకాదు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు కూడా విడుదల చేసింది. దీనికిగాను దాదాపు 579.91 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసింది. ఎంపిక చేసిన జిల్లాలోని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని అందించింది. రైతు భరోసా కింద సోమవారం తొలి రోజు 4.4 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 569 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 18,180 రైతు కూలి కుటుంబాలకు 6000 చొప్పున 10.91 కోట్లను అందించింది.
నిరాశ ఎదురవుతోంది
ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు జమ చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఆరోజు సెలవు దినం కావడంతో జనవరి 27 నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ అవుతాయని ప్రకటించారు. అయితే కేవలం ఎంపిక చేసిన జిల్లాలోని మండలాల్లోని గ్రామాల్లో మాత్రమే రైతులకు రైతు భరోసా నిధులు జమ కావడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. సాగు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కేవలం ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు మాత్రమే భరోసా నిధులు జమ చేయడం విశేషం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అందరి రైతు ఖాతాల్లోకి ఒకేసారి డబ్బు జమ చేస్తుందని అనుకున్నామని.. కానీ ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయడం నిరాశ కలిగిస్తుందని అన్నదాతలు అంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాలలో సర్వే పూర్తి కాలేదని.. పంట భూముల సర్వే పూర్తయిన తర్వాతే రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గనుక ఇదే నిజమైతే రైతు భరోసా పథకం మార్చి నెల నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. అందువల్లే ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన సభలో మార్చి వరకు ఈ పథకాల అమలు పూర్తి చేస్తామని చెప్పారని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి గుర్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలను ఉద్దేశించి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. వ్యంగంగా స్పందించారు.. రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు – కోడి మాంసం విందును గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శలు చేసినట్టుగానే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు ఉండటం ఇక్కడ విశేషం. మరి రైతుల్లో వ్యక్తమవుతున్న నిరసనను.. కూలీల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.