Global Dishes : గ్లోబల్ మాయాజాలం వల్ల.. ప్రపంచీకరణ వేగంగా దూసుకు రావడం వల్ల మనం తినే తిండి పూర్తిగా మారిపోయింది. మనం వాడే వంట పాత్రల నుంచి మొదలుపెడితే ఉపయోగించే వంట దినుసుల వరకు ప్రతిదీ మార్పులకు గురైంది. దీంతో మనిషి ఆరోగ్యం కూడా ప్రభావితమవుతూ వస్తోంది. జీవనశైలి వ్యాధులు.. ఊబకాయం.. మధుమేహం.. రక్త పోటు.. మానసిక ఒత్తిడి.. అధిక బరువు సర్వసాధారణమైపోయాయి.. ఇక్కడే మార్పు మళ్లీ మొదలైంది.. వేటి వైపు అయితే మోజుగా పరుగులు తీశారో.. వాటిని ఇప్పుడు కాదనుకుంటున్నారు.. కొత్తకు చింత.. పాత ఒక రోత అనే నానుడికి కొత్త అర్థం చెబుతూ.. పాతకు జై కొడుతున్నారు.. వెనుకటి కాలంవైపు పరుగులు పెడుతున్నారు. ఆహారాన్ని మార్చుకుంటున్నారు. ఆహార్యాన్ని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లే మునిపటి మన పాత వంటకాలు.. వెనుకటి కాలంలో వాడిన వంట దినుసులు ఇప్పుడు గ్లోబల్ గా ప్రచారం పొందుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా పునరాగమనం
పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, నూడుల్స్, సూప్ ల వంటి వంటకాలు గత కొంతకాలంగా మన ఆహార శైలిలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. దేశ రాజధాని నుంచి మొదలుపెడితే మారుమూల గ్రామం వరకు ఈ వంటకాలు విస్తరించాయి. చైనీస్ వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటివల్ల అనారోగ్య సమస్యలు అంతకంతకు పెరిగిపోవడం.. ఆరోగ్య స్పృహ పై అవగాహన పెరగడంతో చాలామంది మళ్లీ పాతకాలం వంటకాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇదే సమయంలో ఆ వంటకాలు, వాటి తయారీకి ఉపయోగించే దినుసులు గ్లోబల్ గా పేరు పొందడం విశేషం. అందువల్లే తృణధాన్యాల వినియోగం ఇటీవల కాలంలో పెరిగింది. అంతేకాదు విదేశాలకు ఎగుమతి కూడా అవ్వడం మొదలైంది. మనదేశంలో పండే పసుపు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కాఫీ పౌడర్, తేయాకు వంటి వాటిల్లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గతంలో వీటి ఎగుమతులు భారీగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత పెరిగాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు.. ఆరోగ్య స్పృహ కోసం ఐక్యరాజ్యసమితి చేస్తున్న కార్యక్రమాలు భారతీయ వంట దినుసులకు డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి.. భవిష్యత్తు కాలంలో వీటి ఆధారంగానే భారత దేశ విదేశీ మారకద్రవ్యం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా అశ్వగంధ, తులసి వంటి ఆయుర్వేదిక మూలికలు కూడా ఎగుమతి అవుతున్నాయి.
అందువల్లే వినియోగం పెరిగింది
శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వును స్థిరంగా నిలువ ఉంచడంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే కొంతకాలంగా ఈ పుష్ మిల్లెట్స్ ను చాలామంది తమ ఆహారంలో ప్రముఖ భాగం చేసుకుంటున్నారు. సలాడ్, రొట్టెల్లాగా తయారు చేసుకుని తింటున్నారు. ప్రముఖ హోటల్స్ కూడా మిల్లెట్స్ తో ఏకంగా స్పెషల్ మెనులు కూడా ఆఫర్ చేస్తున్నాయి.. వీటిని మన దేశం వారే కాకుండా, ఇతర దేశాల వారు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇక ఇవే కాకుండా పాస్పోర్ట్ తో కలిపి చేసిన పాస్తా, పాలకూర, గోంగూర మిశ్రమంతో కలిపి తయారుచేసిన కార్ టెయిల్, కుంకుమపువ్వుతో తయారుచేసిన స్వీట్లు ప్రముఖంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ” భారతీయ ఆహార విధానం ప్రపంచానికే ఆదర్శం. ప్రతి వంటకాన్ని కూడా శుద్ధిగా ఉడికించిన తర్వాతే తినడం భారతీయుల లక్షణం. పైగా ఈ భూమిలో వనమూలికల నుంచి మొదలుపెడితే పంటల వరకు విరివిగా పండుతాయి. అందువల్లే ఇప్పుడు వీటి వైపు ప్రపంచం పరుగులు తీస్తోంది. మార్పు ఇప్పుడే మొదలైంది కాబట్టి.. భవిష్యత్ కాలంలో అది మరింత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల భారత్ ప్రపంచ ఆహార వైవిధ్యానికి చిరునామాగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సమయంలో పాశ్చాత్యులు కూడా మన ఆహార విధానాన్ని పాటిస్తున్నారు. బాగుందని మెచ్చుకుంటున్నారు. వారు క్రమేపి మన ఆహార విధానానికి అలవాటు పడుతున్నారని” మన దేశ ఆహార రంగ నిపుణులు చెబుతున్నారు.