RS Praveen Kumar Vs ABN RK: ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకు సంపాదకీయం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారితీస్తోంది. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ పై గులాబీ పార్టీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకులు సీమాంధ్ర మీడియా అంటూ ఆరోపణలు చేసిన సందర్భంలో.. రాధాకృష్ణ స్పందించారు. ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకు వ్యాసంలో భారత రాష్ట్ర సమితి నాయకులను చెడుగుడు ఆడుకున్నారు.
ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు, సూర్యాపేట శాసనసభ సభ్యుడు జగదీష్ రెడ్డిని మరగుజ్జు నాయకుడు అని పేర్కొన్నాడు. అంతేకాదు జగదీశ్ రెడ్డి కుమారుడు లండన్ లో చదువుతున్నాడని.. కేటీఆర్ గతంలో గుంటూరులో చదువుకున్నాడని.. ఆయన, సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేశారని.. ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన నేటి రోజుల్లో ప్రాంతీయ భేదాలకు తావు ఎక్కడిదని రాధాకృష్ణ ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు సీమాంధ్ర, తెలంగాణ అనే విషయాలు గుర్తుకు రాలేదని.. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి సీమాంధ్ర మీడియా గుర్తుకు వస్తోందని రాధాకృష్ణ తన వ్యాసంలో పేర్కొన్నాడు.
రాధాకృష్ణ రాసిన వ్యాసం ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చికు దారితీసింది. ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఉదయం నుంచి రాధాకృష్ణ రాసిన వ్యాసం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆదేశాల మేరకే వారు ఈ పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలో కూడా గులాబీ పార్టీ నాయకులు ఆంధ్రజ్యోతిపై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కథనాన్ని ప్రచురించిందనే సాకుతో ఆంధ్రజ్యోతి పత్రికలను తగలబెట్టారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో కేసీఆర్ ఏబీఎన్ ప్రసారాలను తెలంగాణ వ్యాప్తంగా రాకుండా చూశారు. అప్పట్లో రాధాకృష్ణ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టులో కేసు గెలిచి మరీ తన ఛానల్ ప్రసారాలను తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించుకున్నారు. మధ్యలో కెసిఆర్, రాధాకృష్ణకు సయోధ్య కుదిరినప్పటికీ.. అది దీర్ఘకాలం నిలబడలేదు.
2017 నుంచి ఇద్దరి మధ్య మళ్ళి ఉప్పు నిప్పు వ్యవహారం కొనసాగింది. అప్పటినుంచి రాధాకృష్ణ అంటే కెసిఆర్ కు.. కెసిఆర్ అంటే రాధాకృష్ణకు పడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడిక రాధాకృష్ణ రాసిన వ్యాసాన్ని గులాబీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందులో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు.. ఆంధ్రజ్యోతి పేరులో ఆంధ్ర అనే పదాన్ని మార్చుకోకుండా తెలంగాణలో ఎలా వార్తలను ప్రచురిస్తారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు..
“తెలంగాణ వచ్చిన అనంతరం కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ జ్యోతిగా పేరు మార్చుకోలేదు. ఆంధ్రజ్యోతి పేపర్ గానే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సర్కులేట్ అవుతోంది. తెలంగాణ ప్రజల కష్టం ప్రకటనల రూపంలో దోపిడీకి గురవుతోంది. విశాలాంధ్ర పత్రిక మన తెలంగాణగా.. ప్రజాశక్తి నవతెలంగాణ గా మారిపోయాయి. పేరు మార్చుకోకుండా వలసవాద భావాలను తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నది. ఆంధ్ర పాలకుల తొత్తులకు దండుగా నిలుస్తున్నది. ఆంధ్ర మూలాలు ఉన్న దినపత్రిక/ ఛానల్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి? ఎందుకు చూడాలి? ఒక్కసారి ఆలోచించండి” అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మరి దీనిపై ఆంధ్ర జ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది..
తెలంగాణ వచ్చిన తరువాత కూడా ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ‘తెలంగాణ జ్యోతి’ గా పేరు మార్చుకోకుండా తెలంగాణ లో ఇంకా సర్కులేట్ ఐతనే ఉన్నది! తెలంగాణ ప్రజల కష్టార్జితం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోపిడికి గురైతూనే ఉన్నది.
విశాలాంధ్ర మన తెలంగాణ గా, ప్రజాశక్తి నవ తెలంగాణ గా తొలినాళ్లలో నే పేరు… pic.twitter.com/14qscf5WlT— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 6, 2025