RK Kotha Paluku: రాజకీయ నాయకులకు అధికారమే కావాలి. అధికారం కోసం వారు ఏదైనా చేస్తారు. ప్రజలలో వైషమ్యాలు రగిలించడానికి ఎంతకైనా తెగిస్తారు. ఈ జాబితాలో అన్ని పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకులూ ఉంటారు. దీనికి భారత రాష్ట్ర సమితి మినహాయింపు కాదు. ప్రస్తుతం ఆ పార్టీకి అధికారం దూరమైంది కాబట్టి.. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు గుర్తుకు వచ్చాయి. తెలంగాణ అస్తిత్వం గుర్తుకు వస్తున్నది. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర మీడియా గుర్తుకు వచ్చింది. అందువల్లే దాడులకు పాల్పడతామంటూ హెచ్చరిస్తోంది. దాడులకు పాల్పడితే తెలంగాణ ఆస్తిత్వం నిలబడుతుందా? తెలంగాణ ఆత్మగౌరవం సాకారం అవుతుందా? ఈ ప్రశ్నలకు గులాబీ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
ఓ న్యూస్ ఛానల్ మీద జరిగిన దాడి విషయంలో గులాబీ పార్టీ నాయకుల మూర్ఖత్వం ఎంత ఉందో.. ఆ న్యూస్ ఛానల్ పెట్టిన థంబ్ నెయిల్స్ పాత్ర కూడా అంతే ఉంది. దాడి చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వారు తమ రాజకీయాల గురించి మాట్లాడుతారు. తమ దాడులను గురించి సమర్థిస్తారు. పైగా రాజకీయంగా మైలేజ్ పొందాలి కాబట్టి ఏవేవో మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈ మాటలను తెలంగాణ సమాజం అంతగా విశ్వసించే అవకాశం లేదు. ఎందుకంటే 2023 శాసనసభ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో అది తేలిపోయింది. ఎలాగూ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో అధికారం కావాలి కాబట్టి గులాబీ పార్టీ నాయకులు తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఏవేవో వ్యాఖ్యలు చేస్తుంటారు. బాధ్యతగల మీడియా అధిపతిగా వేమూరి రాధాకృష్ణ వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు మీడియా అధినేతగా చెత్త థంబ్ నెయిల్స్ పెట్టిన మీడియా సంస్థను.. దాడులకు పాల్పడిన వ్యక్తులను మందలించి.. మీడియా ఎలా వ్యవహరించాలో.. రాజకీయ నాయకులు ఎలా ఉండాలో చెబితే సరిపోయేది. అలా కాకుండా సీమాంధ్ర అంటూ వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని మరుగుజ్జు అనడం.. ఆయన కుమారుడిని లండన్ లో చదివిస్తున్నాడు అని చెప్పడం.. గతంలో కేటీఆర్, కేసీఆర్ అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా? కేటీఆర్ గుంటూరులో చదవలేదా? అని రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాయడం నిజంగా అభ్యంతరకరం. జగదీష్ రెడ్డి రాజకీయ నాయకుడు కాబట్టి అలాంటి బజారు భాషే మాట్లాడుతాడు. కానీ రాధాకృష్ణ అలా కాదు కదా.. పైగా ఒక బాధ్యత గల మీడియా సంస్థను నిర్వహిస్తున్నాడు కదా.. అలాంటప్పుడు పాత్రికేయుడిగా కాకుండా ఓ రాజకీయ నాయకుడిలాగా ఈయన కూడా వ్యాఖ్యలు చేయడం దేనికి నిదర్శనం? సీమాంధ్ర అని జగదీష్ రెడ్డి మాట్లాడినప్పుడు రాధాకృష్ణ ఎందుకు స్పందిస్తున్నారు? రాధాకృష్ణ పుట్టింది నిజామాబాద్ జిల్లాలో కదా.. ఆయన కూడా తెలంగాణ బిడ్డ కదా..అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తే.. చెత్త చెత్త స్టోరీలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. వాటిని రాధాకృష్ణ నెగిటివ్ కోణంలో తీసుకోవాల్సిన అవసరం ఏముంది.
కేటీఆర్ గుంటూరులో చదివింది వాస్తవమే. జగదీష్ రెడ్డి కుమారుడు లండన్ లో చదువుతున్నది కూడా వాస్తవమే. ఇవి తప్పుగా అనిపించినప్పుడు.. మరి రాధాకృష్ణ చేస్తున్నది పాత్రికేయ వృత్తి.. అలాంటప్పుడు ఆయన పిల్లల్ని కూడా జర్నలిజం చదివించాలి కదా.. అలా కాకుండా కుమార్తెను డాక్టర్.. కుమారుడిని ఇంజనీరింగ్ ఎందుకు చదివించారు? ఈ ప్రశ్నకు రాధాకృష్ణ సమాధానం చెప్పగలరా? వాస్తవానికి రాజకీయ నాయకులు మాట మీద ఉండరు. ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి ఏవేవో మాటలు చెబుతుంటారు. వాటిని రాధాకృష్ణ ఎలా ఎందుకు నొక్కి వక్కానిస్తున్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తారు. అప్పట్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టిడిపి అభ్యర్థి గెలవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేయలేదా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ వ్యవహారాలు సాగించలేదా.. చంద్రబాబు ప్రయత్నాలు తెలిశాయి కాబట్టి కెసిఆర్ అడ్డుకున్నారు.. ఒక ముఖ్యమంత్రిగా తన పరిధిలోని అధికారాలను వాడుకున్నారు. దాన్ని రాధాకృష్ణ తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక సహాయం చేయడంలో కేసీఆర్ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. దానిని తప్పు పట్టడానికి రాధాకృష్ణ ఎవరు? ప్రస్తుతం ప్రింట్ మీడియా పరిస్థితి బాగోలేదు.. ముఖ్యంగా అగ్ర పత్రిక చాలావరకు పేజీల సంఖ్యను తగ్గించింది. కానీ ఆంధ్రజ్యోతి పేజీల సంఖ్యను పెంచింది. అంతేకాదు పత్రికకు మరింత బలం చేకూర్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. నెంబర్ వన్ గా ఎదగాలని రాధాకృష్ణకు ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇది తప్పని అగ్ర పత్రిక యాజమాన్యం ప్రశ్నిస్తే రాధాకృష్ణ ఎక్కడ ముఖం పెట్టుకుంటారు..
స్థూలంగా కొత్త పలుకులో భారత రాష్ట్ర సమితిని రాధాకృష్ణ ఎండగట్టిన విధానం బాగానే ఉంది గాని.. కాకపోతే ఒక పాత్రికేయుడుగా కాకుండా ఒక పొలిటికల్ లీడర్ గా అతడు స్పందించినట్టు కనిపిస్తోంది. కాకపోతే ఈ ఆదివారం నాటి కొత్త పలుకు టిడిపి, కాంగ్రెస్ అభిమానులకు రుచించవచ్చు. భారత రాష్ట్ర సమితి నాయకులకు, ఫ్యాన్ పార్టీ అభిమానులకు నచ్చదు. ఎందుకంటే ఇందులో రాధాకృష్ణ జర్నలిస్టుగా రాసిన దానికంటే.. కొన్ని పార్టీలకు అభిమానిగా రాసిన రాతలే ఎక్కువగా ఉన్నాయి. ఏతా వాతా రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో హైలెట్ పాయింట్ ఏంటంటే జగదీష్ రెడ్డిని మరగుజ్జు అని పేర్కొనడమే.. మరుగుజ్జు నాయకుడు అని రాధాకృష్ణ పేర్కొన్నాడు కాబట్టి.. ఇకపై ఆంధ్రజ్యోతిలో జగదీష్ రెడ్డి వార్తలు కనిపించవా? ఏబీఎన్ లో జగదీష్ రెడ్డి దర్శనమివ్వడా? ఆంధ్రజ్యోతికి జగదీశ్ రెడ్డి యాడ్స్ ఇవ్వడా? అబ్బే భలే వారే.. జగదీష్ రెడ్డి మాట మీద ఉండడు.. రాధాకృష్ణ తను రాసిన కొత్తపలుకు మీద నిలబడడు. మధ్యలో బకరాలయ్యేది ఎవరయ్యా అంటే ఓటు వేసిన ప్రజలు.. పేపర్ కొనుగోలు చేసిన పాఠకులు..