Indiramma Houses : పేదల సొంతింటి కల నెరవేరుస్తామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించి, సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, స్థలం లేనివారికి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఎట్టకేలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జనవరి 26న ప్రారంభించారు. ఈమేరకు లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు. మొదటి విడత అర్హుల లిస్ట్ రూపొందిస్తున్నారు. ఈ లిస్టును ఇన్‌చార్జి మంత్రులు పరిశీలించి ఓకే చేస్తారు. మొదటి విడత(First Fase)లో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.లక్ష జమ చేస్తారు. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
నిరంతర ప్రక్రియ..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మంజూరు నిరంతరం కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా గతంలో ఇదే విషయం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన(Praja palana)లో వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం ఎల్–1 21.93 లక్షలు, ఎల్–2లో 19.96 లక్షలు, ఎల్–3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలో ఇంకా 2.43 లక్షల ఇళ్లు పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
ఎలక్షన్ కమిషన్ అనుమతి..
ఇదిలా ఉంటే.. కొత్తగా ప్రారంభించిన నాలుగు పథకాలకు ఎన్నికల సంఘం(Election Commission) బ్రేక్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. కోడ్ కారణంగా పథకాలు ఆగిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డుల(Ration Cards)జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.
రేషన్ కార్డులపై..
ఇక రేషన్ కార్డుల దరఖాస్తుల గందరగోళంపై పౌరసరఫరాల శాఖ(Civil Supply department) క్లారిటీ ఇచ్చింది. కొత్త కార్డులకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయాలని మీసేవను కోరినట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పులకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.