CM Revanth Reddy: తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ ప్రమాద బారిన పడ్డారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉండగా.. గురువారం అర్ధరాత్రి బాత్రూంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడమ కాలి తుంటి ఎముకకు గాయమైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిల కడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన 2023 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. కానీ రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిపించింది. కెసిఆర్ కు ఓటమి తప్పలేదు. అయితే ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కేసీఆర్ విలువైన సలహాలు, సూచనలు ఇస్తే పాటిస్తామని రేవంత్ ప్రకటించారు. ఆయన నాకు తండ్రి తో సమానమని చెప్పుకొచ్చారు.అదే సమయంలో ఆయన పాలన తీరును విమర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కెసిఆర్ వైఫల్యాలను ఎండగడుతూ… కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు.
ఇటువంటి తరుణంలో కెసిఆర్ గాయపడటంతో రేవంత్ స్పందించారు. కెసిఆర్ చికిత్స పొందుతున్న యశోద ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలని పోలీస్ శాఖకు ఆదేశించారు.దీంతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ భద్రతను పెంచారు.తెలంగాణ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన కెసిఆర్ కు భద్రత ముఖ్యమని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇంకా తెలంగాణలో ఎన్నికల వేడి ముగియనందున అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగానే.. భద్రతను పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ తీసుకుంటున్న చర్యలపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే కేసీఆర్ అంటే రేవంత్ కు ఎంత ప్రేమోనని కామెంట్స్ చేస్తున్నారు.