CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనతో దూకుడు, వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. నెల రోజుల్లోనే తన పాలనా శైలి ఎలా ఉంటుందో తెలియజేశారు. ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, తమది ప్రజా పాలన అని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైనా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణను ప్రమోట్ చేయడానికి కష్టపడుతున్నారు. అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. రెండు రోజుల్లోనే 60కిపైగా సమావేశాల్లో పాల్గొన్నారు. వీరిలో చాలా మంది తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు. కొంతమంది అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.
పెట్టుబడులే లక్ష్యంగా..
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిసిన రేవంత్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మేకొనెన్‌తోపాటు పలువురు పారిశ్రామికవేత్తలతో రేవంత్‌రెడ్డి సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు.
హెల్త్ సెక్టార్‌లో రేవంత్ ప్రసంగం..
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా జనవరి 17న హెల్త్ సెక్టార్‌లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అంశంపై సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌ను కలిసేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. నోవర్తీస్, మడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక్, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, యూపీఎల్ వంటి అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు రేవంత్‌తో జనవరి 17న సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఎముకలు కొరికే చలిలోనూ..
దావోస్‌లో ఇప్పుడు చలికాలం. భారత వాతావరణానికి అలవాటుపడిన వారు అక్కడ ఇబ్బంది పడతారు. చలి కారణంగానే సదస్సుకు వెళ్లడం లేదని ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. రేవంత్‌రెడ్డి మాత్రం అధికారుల బృందంతో కలిసి ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా పెట్టుబడుల వేట సాగిస్తున్నారు. గతంలో కేటీఆర్ కూడా ఏటా సమావేశాలకు వెళ్లేవారు.