Revanth Reddy: రేవంత్ వల్ల వెలుగులోకి ‘తెలంగాణ చీకట్లు’

ఎత్తిపోతలు సహా ప్రభుత్వ సంస్థల బకాయిలు, సాగుకు 24 గంటల విద్యుత్తు సరఫరా, మీటర్‌ ఆధారంగా విక్రయించే కరెంటు సరఫరా తగ్గిపోవడం.. డిస్కమ్‌ల నష్టాలకు ప్రధానంగా ఇవే కారణాలు.

Written By: Bhaskar, Updated On : July 12, 2023 3:38 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy: “ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రభుత్వాధినేతలు తమ కమీషన్ల కోసం విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పటికీ తమకు అనుకూల సంస్థల వద్ద ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు..దీనికి “పీక్ లోడ్” అని పేరు పెడుతున్నారు. ” ఇవీ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ మీద చర్చ జరిగినప్పుడు తానా మహాసభల్లో చేసిన వ్యాఖ్యలు. ఇది భారత రాష్ట్ర సమితి కోణంలో తప్పు అనిపించవచ్చు. కానీ విద్యుత్ గురించి, పీక్ లోడ్ అవసరం గురించి తెలిసిన వాళ్ళకు అందులో ఉన్న లోగుట్టు ఏమిటో సరిగ్గా అర్థమవుతుంది. ప్రభుత్వం విద్యుత్ విజయం అంటూ గొప్పలు చెప్పుకుంటుంది కానీ.. అసలు విషయాలను మాత్రం మరుగున పడేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ తుట్టెను కదిపాడు. ఫలితంగా అసలు విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

అప్పుడు 20,000 కోట్లే..

రాష్ట్రం ఏర్పాటైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కరెంటు కొనుగోళ్లు రూ.20,908 కోట్లు. కానీ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రూ.36,934 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డిస్కమ్‌లకు వచ్చే ఆదాయమంతా కరెంట్‌ కొనుగోళ్లకే పోతోంది. ఇక ప్రభుత్వ సంస్థల కరెంట్‌ బకాయిలు ఏటికేడు కొండలా పేరుకుపోతున్నాయి. వాటిని ప్రభుత్వం తిరిగి చెల్లించడం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన 2014లో నీటిపారుదల (ఎత్తిపోతల) బకాయిలు కేవలం రూ.107 కోట్లు మాత్రమే. కానీ, 2022 (నవంబరు నాటికి)కు వచ్చేసరికి ఇవి కాస్తా రూ.9,268.21 కోట్లకు పెరిగాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ బకాయిలు తొమ్మిదేళ్ల కిందట కేవలం రూ.740 కోట్లు మాత్రమే. ఇప్పుడు అవి రూ.6,353.14 కోట్లకు పెరిగిపోయాయి. ఇలా.. వివిధ ప్రభుత్వ శాఖల బకాయిలన్నీ కలిపి 2014లో కేవలం రూ.1,302 కోట్లు మాత్రమే. కానీ, అవి 2022 డిసెంబరు నాటికి ఏకంగా (తెలంగాణ ఈఆర్సీకి డిస్కమ్‌లు సమర్పించిన లెక్క ప్రకారం) రూ.20,841 కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిలన్నీ ఏకకాలంలో విడుదలైతే డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా 40 శాతానికిపైగా తగ్గనున్నాయి. కానీ, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. పైగా ప్రభుత్వం ఓట్ల కోసం కొత్త కొత్త పథకాలు తెరపైకి తేవడం తో విద్యుత్ శాఖ మీద విపరీతమైన భారం పడుతున్నది. పోనీ ఇవేమన్నా రెవెన్యూ తెచ్చే మార్గాలా? అంటే కానే కాదు. కేవలం ఆ సామాజిక వర్గం ఓట్లు సంపాదించుకునేందుకు అధికార పార్టీ వేసిన జిమ్మిక్కులు.

ఇది గుది బండ కాదా?

ఎత్తిపోతలు సహా ప్రభుత్వ సంస్థల బకాయిలు, సాగుకు 24 గంటల విద్యుత్తు సరఫరా, మీటర్‌ ఆధారంగా విక్రయించే కరెంటు సరఫరా తగ్గిపోవడం.. డిస్కమ్‌ల నష్టాలకు ప్రధానంగా ఇవే కారణాలు. విద్యుదుత్పత్తి వ్యయం, పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలు పెరగడమూ కూడా ఒక కారణమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు సంస్థల ఆర్థిక సామర్థ్యానికి మీటర్‌ ఆధారిత విక్రయాలే ప్రాతిపదిక. కానీ, ఇవి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. తెలంగాణలో రెండు డిస్కమ్‌లు ఉండగా.. వాటిలో దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌- హైదరాబాద్‌)లో మీటర్‌ ఆధారిత విక్రయాలను 2021-22లో 65.81 శాతం (30,794 మిలియన్‌ యూనిట్లు); 2022-23లో 70.06 శాతం(35,942 మిలియన్‌ యూనిట్లు), 2023-24లో 73.48 శాతం (41,762 మిలియన్‌ యూనిట్లు)గా అంచనా వేశారు. ఇక, గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే ఎన్పీడీసీఎల్‌ (వరంగల్‌)లో మీటర్‌ ఆధారిత విక్రయాలు తీసికట్టుగా ఉన్నాయి. 2021-22లో వీటిని 54.69 శాతం (11,222 మిలియన్‌ యూనిట్లు)గా లెక్కించగా 2022-23లో 53.90 శాతం (10,737 మిలియన్‌ యూనిట్లు), 2023-24లో 60.26 శాతం (13,975 మిలియన్‌ యూనిట్లు)గా అంచనా వేశారు. వ్యవసాయ వినియోగాన్ని లెక్కించడానికి మీటర్లు లేకపోవడం, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, వాటర్‌ బోర్డుల్లో మీటర్లు ఉన్నా రీడింగ్‌ తీయకపోవడమే ఇందుకు కారణం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును దేశవ్యాప్తంగా ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకొంటున్నారు. కానీ, ఈ కారణంగానే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడం; రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు ఆర్థిక సాయం పెరగకపోవడంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిస్కమ్‌లు విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నాయి. సాగుకు నిరంతర విద్యుత్తు నాలుగేళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఎన్పీడీసీఎల్‌లో వ్యవసాయానికి ఒక యూనిట్‌ కరెంట్‌ అందించడానికి రూ.8.96 ఖర్చవుతోంది. కానీ, సబ్సిడీలు కూడా కలుపుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రూ.4.44 మాత్రమే. సాగుకు 24 గంటల కరెంట్‌ తర్వాతే డిస్కమ్‌లు దివాలా తీశాయని ఉద్యోగులు మండిపడుతున్నారు. అవసరం లేకున్నా విద్యుత్‌ను సరఫరా చేసి, ఆ మేరకు సబ్సిడీని డిస్కమ్‌లు రాబట్టుకోలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం మీటర్ రీడింగ్ ప్రవేశపెట్టింది. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతున్నది. అది అంతిమంగా డిస్కమ్ లకు లాభం చేకూర్చుతోంది. కానీ ఇదే మీటర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వితండ వాదనకు దిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తన సొంత మీడియాలో అడ్డగోలుగా వార్తలు రాయించింది.

భారీగా నష్టాలు

ఇక, డిస్కమ్‌లు కూడా 2018-19 నుంచే భారీగా నష్టాలను చవిచూస్తున్నామని చెబుతున్నాయి. 2018 నుంచి గత నాలుగేళ్లలోనే ఏకంగా రూ.22897.74 కోట్ల నష్టాలను మూటగట్టుకోవడాన్ని గుర్తు చేస్తున్నాయి. నష్టాలకు చూపించిన కారణాల్లో ఫీడర్‌ మిక్సింగ్‌, వ్యవసాయేతర, వ్యవసాయ కనెక్షన్లకు ఒకే ఫీడర్లు ఉండడం కూడా కారణమని పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా డిస్కమ్‌ల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్‌ పథకం కారణంగా రాష్ట్ర డిస్కమ్‌లకు కూడా కొంత ఊరట లభించింది. 2015 నాటికి డిస్కమ్‌లు రూ.11,897 కోట్ల అప్పుల్లో ఉండేవి. ఉదయ్‌ పథకంలో భాగంగా వాటిలో 75 శాతాన్ని అంటే, రూ.8,923 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తన మీదికి మళ్లించుకుంది. ఆ తర్వాత క్రమంగా డిస్కమ్‌ల నష్టాల్లో కొంత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం షరతు విధించడంతో 2017 నుంచి ఇప్పటి వరకూ రూ.13,955కోట్లను డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. నష్టాలను ఏయేటికాయేడు తగ్గించుకోవడానికి కేంద్రం పలు సూచనలు చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. దీంతో ఇప్పుడు నష్టాలు ఏకంగా రూ.45 వేల కోట్లను దాటేశాయి. ఇక ప్రస్తుతం డిస్కమ్‌ల అప్పులు రూ.30వేల కోట్లపైనే ఉన్నాయి. వీటిని వ్యాపార విస్తరణ కోసం తీసుకోగా.. రిటర్న్‌ ఆఫ్‌ ఈక్విటీ కింద వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ అనుమతి కూడా ఉంది. అందువల్లే విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెరిగాయి. చివరికి పీక్ లోడ్ పేరుతో కొనుగోలు చేసే కరెంటు భారాన్ని కూడా వినియోగదారులపైనే విద్యుత్ సంస్థలు మోపుతున్నాయి. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం దాస్తోంది. దీనంతటికి కారణం కేంద్ర ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తే అతనిపై రైతు ద్రోహి అనే ముద్ర వేస్తోంది. ఏ మాటకు ఆ మాట భారత రాష్ట్ర సమితి పెద్దలు ఉచిత విద్యుత్ పేరుతో చేస్తున్న ఈ లూటీ రేపటి నాడు విద్యుత్ డిస్కమ్ ల పుట్టి ముంచుతుందని తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులు చెబుతున్నారు.