CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయ వైరం రోజురోజుకు ముదిరి పాకాన పడుతోంది. రేవంత్ విమర్శలు చేయడం.. భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రతి విమర్శలు చేయడం.. పోటాపోటీగా సవాళ్లు విసురుకోవడం.. ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదం సాగుతోంది.
రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి మీద విమర్శల జోరు పెంచారు. ప్రతి సభలోను గణాంకాలతో సహా విమర్శలు చేస్తున్నారు. వీటికి గులాబీ పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇటీవల కేటీఆర్ ఒక కీలక ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 200 కోట్లు ఖర్చుతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రగతిభవన్ ఉందని.. అది అందుబాటులో ఉండగానే రేవంత్ రెడ్డి 200 కోట్లతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం కొత్త భవనం చుట్టూ రక్షణ గోడ నిర్మించడానికి 19 కోట్లు ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.. అంతేకాకుండా ముఖ్యమంత్రి తన సతీమణితో కలిసి కొత్త భవనంలోకి అర్ధరాత్రి పూట గృహప్రవేశం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అంత అర్ధరాత్రి పూట దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
గతంలో కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా విభాగాలు రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టాయి. అప్పట్లో కూడా గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న భవనం మీద విమర్శలు చేసింది. అసలు ఎందుకు ఈ స్థాయిలో భవన నిర్మించాలో చెప్పాలని డిమాండ్ చేసింది. మళ్లీ ఇప్పుడు కేటీఆర్ రంగంలోకి దిగి గృహప్రవేశం చేశారని రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. ఒకవేళ భవనం నిర్మించకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పాటికే ఎదురుదాడి చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉందంటే ఏదో జరుగుతోందనే అనుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

