Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్ని పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 21 ఏళ్ల వయసున్న వారు ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు అర్హులుగా ఎన్నికల నిబంధనను సవరిస్తామని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా చేసిన తరువాత దీన్ని అమలులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం 25 ఏళ్లు నిండినవారు మాత్రమే ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అర్హులను విషయం తెలిసిందే. గతంలో వయోజన ఓటు హక్కు 21 సంవత్సరాలుగా ఉండేది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తూ సవరణ చేశారు. కానీ భవిష్యత్తులో యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనే తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. 25 ఏళ్లు వచ్చే వరకు ఆగకుండా 21 ఏళ్లకే ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందనే నవయువకులు పోటీ చేసేందుకు ముందుకురావచ్చని భావిస్తున్నారు.
*యువతను ఆకర్షించేందుకేనా..?*
ప్రతీ ఎన్నికలో రాజకీయ నాయకుల తలరాతలు మార్చేది యువతనే, కొత్తగా ఓటరుగా నమోదయ్యే యువత దాదాపు ఆయా గ్రామ, మండల, నియోజకవర్గాల్లో గెలుపోటములనూ ప్రభావితం చేస్తారు. ప్రతి సంవత్సరం వేలాదిగా కొత్త ఓటర్లు నమోదు అవుతూనే ఉన్నారు. అయితే ఆ ఓట్లను తనవైపుకు తిప్పుకునేందుకు పార్టీలు వివిధ రకాలుగా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఈ తరం యువతలో దేశభక్తి మెండుగా కనిపిస్తోంది. సహజంగా ఎప్పటికప్పుడు ఏదో మార్పును కోరుకునే యువత ఎవరిని అందలమెక్కిస్తారో.. ఎవర్ని అదపాతాలానికి తొక్కుతారో ఫలితాలు వచ్చేవరకు ఎవరివైపు ఉన్నారో అంచనా వేయడం సర్వేలు చేసే వారికి సైతం కష్టమే. కొంతమంది క్రియాశీలకంగా ఏదో ఒకపార్టీ కార్యకర్తగా, యువ నాయకునిగా తన తోటి మిత్రులు, సహచరుల మద్దతు కూడగట్టుకోవడం పక్కన పెడితే.. బహిరంగంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా నిశబ్ద విప్లవానికి ఇష్టపడే యువత నే ఎక్కువ ఉంది. దేశ, రాష్ట్ర, కాలమాన పరిస్థితులను బట్టి వారి ఓటు నిర్ణయం అవుతుంది. అన్ని కోణాల్లో ఆలోచించి ఓటు నిర్ణయించుకునే వీరి ఓటు పొందడం నాయకులకు శల్య పరీక్షనే..
*నూతన యవ్వనంలోనే రాజకీయ వాసనలు*
కళాశాలల్లో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థి సమస్యలపై పోరాటం చేసే యువ నాయకుల్లో కొందరైనా ఆ సమయంలో చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్ళూరుతూనే ఉంటారు. అదే ప్రస్తానం కొనసాగించి, అనుకున్న లక్ష్యం చేరిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే లక్ష్యానికి దూరంగా ఉన్న నిబంధనను సవరించడంతో సమయం కోసం వేచిచూడకుండా వెనువెంటనే చట్ట సభలకు పోటీ చేసే అవకాశం వస్తుందని, ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనకు పెద్ద ఎత్తున మద్దతు పలికే అవకాశముంది. ఓటుహక్కు 21 నుంచి 18 ఏళ్లకు మార్పు తీసుకువచ్చిన సమయంలో యువత అనూహ్యంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పెద్ద ఎత్తున అభిమానించారు. అదే రీతిలో పోటీ చేసే వయస్సు తగ్గిస్తామని ప్రతిపాదన కూడా ప్రస్తుతం రాహుల్ గాంధీ కి తద్వారా కాంగ్రెస్ పార్టీకి యువత మద్దతు లభించే అవకాశాలున్నాయి. అయితే ఈ సమయంలో ఈ ప్రతిపాదనను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, పార్టీ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదన మూలంగా యువత స్పందించే తీరు ఓటు బ్యాంకుపై పడుతుందని భావించి, సర్వేల ఆధారంగా యువత అభిప్రాయాలను సేకరించి తామే మొదట ఈ సవరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.