Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా.. రెండు పర్యాయాలు ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్‌నే ప్రజలు గెలిపించారు. 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గద్దె దించి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. డిసెంబర్‌లో రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నిలబెట్టుకున్నారు. తర్వాత రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. ఇంతలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో హామీల అమలు నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పంట రుణాల మాఫీపై దృష్టిపెట్టారు. జూలై 18 నంచి ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తి కావడంతో మరిన్ని హామీలపై రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. తెలంగాణలో ప్రతీ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల కోసం అర్హులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ హామీ అమలుపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ ఛైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి వివరాలు అందించారు.
గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్‌రెడ్డి..
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిచబోతున్నట్లు వెల్లడించారు. మంగళవారం(ఆగస్టు 27న) సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం. సెప్టెంబర్‌లో 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇందు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని అధికారులను అదేశించారు. కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరిస్తామని తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేషన్ కార్డులకు హెల్త్ కార్డుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
గోషామహల్‌కు ఉస్మానియా హాస్పిటల్..
తాజా సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయంం తీసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. గోషామహల్‌లో నిర్మించతలపెట్టిన కొత్త ఉస్మానియా ఆస్పత్రిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్స్‌తో డిజైన్‌లను రూపొందించాలని తెలిపారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్‌లు సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. గోషామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం గోషామహల్ పోలీసు మైదానంలో నిర్మించనున్నట్లు ఈనెల మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం ప్రకటించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More