Revanth Reddy : ఒక్కో పథకానికి రేవంత్ మంగళం.. పది నెలల్లోనే ఇంత తేడానా..?

ఇంతవరకు ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింద లేదు. దాంతో మహిళలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఏమైనా అంటే.. నిధులు లేవని రేవంత్ సర్కార్ చెబుతోంది. నిధులు లేవని పథకాల అమలుకు డేర్ చేయడం లేదనే టాక్ నడుస్తోంది.

Written By: Srinivas, Updated On : October 6, 2024 9:21 pm

CM Revanth Reddy(14)

Follow us on

Revanth Reddy : గత దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ ప్రభుత్వం హయాంలో పలు ప్రజాకర్షక పథకాలు అమలయ్యాయి. అయితే.. పది నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం స్కీముల్లో కొన్నింటికి మంగళం పాడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు నిధుల లేమి.. మరోవైపు ఆ స్కీముల్లో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ ఈజీగా వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అలా.. ప్రజలకు సైతం అనుమానం రాకుండా.. ఒక్కో పథకం నుంచి భారాన్ని తగ్గించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పండుగ వచ్చిందంటే ఎక్కడెక్కడో ఉన్న మహిళలంతా తమ తల్లిగారింటికి చేరుతుంటారు. తొమ్మిది రోజుల పాటు మహిళలంతా ఒక దగ్గరకు చేరి.. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపడుతుంటారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వచ్చే గురువారం సద్దుల బతుకమ్మ సైతం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రమంతటా మహిళల్లో రేవంత్ సర్కార్‌పై కీలక చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి బతుకమ్మ పండుగ వచ్చిందంటే రేషన్ కార్డులు కలిగిన మహిళలందరికీ ఒక్కో చీర ఇచ్చే వారు. పండుగకు బహుమతిగా అందించే వారు. అలా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేవారు.

పది నెలల క్రితం అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు కేరాఫ్ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇచ్చే కానుకకు మంగళం పాడారు. రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు వారికి చీరలు అందించలేదు. అయితే.. బతుకమ్మ చీరల పథకంలో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చాలా మంది చీరల పేరిట అడ్డగోలుగా దోచుకున్నారని చెబుతోంది. అయితే.. ఈసారి చీరలకు బదులు రూ.500 చొప్పున నగదు అందిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ.. పండుగ ప్రారంభమై ముగిసే సమయం దగ్గరపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన కనిపించడంలేదు. ఏటా అందే చీరలు రాకుండా పోయాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన లీకులు రూ.500 కూడా మహిళలకు అందకుండా పోయాయి. దాంతో ఈసారి ప్రభుత్వం తరఫున బతుకమ్మ బహుమతి లేకుండానే మహిళలు పండుగను జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది.

రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు బీమాకు కూడా రేవంత్ సర్కార్ బైబై చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీమా కవరేజీని అమలు చేసింది. ఆగస్టు 15, 2018 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతుల తరఫున లైఫ్ ఇన్సూరెన్స్‌కు సంవత్సరానికి రూ.500 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. దాంతో ఏ రైతు మరణించినా తెలంగాణలో ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ఏ కారణంతో మరిణించినప్పటికీ ఈ బీమా కవరేజీ ద్వారా పరిహారం పొందొచ్చు. అయితే.. ఈ బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అక్కర్లేదు. రైతు చనిపోయిన పది రోజుల్లోపు నామినీకి పరిహారం అందిస్తారు. అయితే.. రేవంత్ సర్కార్ ఈ పథకానికి గుడ్ బై చెప్పినట్లుగా సమాచారం. నిధులు లేవనే సాకుతో రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద లక్ష సహాయంతో పాటు తులం బంగారం సైతం ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. కానీ.. అధికారం చేపట్టి ఇంత కాలం అయినప్పటికీ ఆ తులం బంగారం విషయంపై ఇంతవరకు ప్రస్తావన తీసింది లేదు. కనీసం.. కాంగ్రెస్ పెద్దలు లేదా ముఖ్యమంత్రి రేవంత్, మంత్రివర్గం కూడా ఈ స్కీమ్‌పై ఎక్కడా మాట్లాడిన దాఖలాలు కనిపించడంలేదు. దీంతో అసలు హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఈ విషయం గుర్తుందా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

మరో మేజర్ స్కీమ్.. మహిళలకు రూ.2,500 సహాయం. తాము అధికారంలోకి వస్తే.. ప్రతీ మహిళకు రూ.2,500 చొప్పున నెలనెలా అందిస్తామని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ చేర్చారు. దాంతో మహిళలంతా ఇక తమకు నెలనెలా రూ.2,500 వస్తాయని సంబురపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ.. ఇంతవరకు ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింద లేదు. దాంతో మహిళలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఏమైనా అంటే.. నిధులు లేవని రేవంత్ సర్కార్ చెబుతోంది. నిధులు లేవని పథకాల అమలుకు డేర్ చేయడం లేదనే టాక్ నడుస్తోంది.

– B.S