CM Revanth Reddy: తెలంగాణ వరద బాధితులకు భారీ వరం ప్రకటించిన రేవంత్ రెడ్డి

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. పెద్ద ఎత్తున వరదలు పోటెత్తడంతో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంత ఇళ్లు నీటమునిగాయి. విజయవాడలో 40 శాంత నీట మునిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

Written By: Raj Shekar, Updated On : September 9, 2024 11:27 am

CM Revanth Reddy(10)

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో పది రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు, రైలు మార్గాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున పంటలు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితుల కష్టాలను ఆయన డైరెక్టుగా చూశారు. దాంతో ప్రజలకు ఆర్థిక సాయం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సీఎం పర్యటనకు ముందు ప్రభుత్వం వరద బాదిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వరదలతో సర్వం కోల్పోతే రూ.10వేలు మాత్రమే ఇస్తామంటారా అని బాధితులు వరద బాధిత ప్రాంతాలకు వెళ్లిన సీఎంను ప్రశ్నించారు. వారి ఆవేదనలో అర్థముంది. ఈసారి వచ్చిన వర్షాలు, వరదలూ చాలా తీవ్రంగా ఉన్నాయి. అందువల్ల ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. వారిని ఉద్దేశించి ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.

రూ.17,500 ఆర్థికసాయం…
ఈ క్రమంలో వరదల్లో సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ ప్రభుత్వం రూ.17,500 ఇవ్వనున్నట్లు తెలిసింది. నిజానికి ఇది కూడా సరిపోదు. కానీ ప్రభుత్వం దగ్గర భారీగా డబ్బు లేదు. ఆల్రెడీ పథకాల అమలుకే చాలా ఖర్చు చేసింది. రుణమాఫీ కోసం వేల కోట్లు అయ్యాయి. రైతు భరోసాకు డబ్బులు కావాలి. ఈ క్రమంలోనే వరద బాధితులకు రూ.17,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

లెక్క ప్రకారమే సాయం..
ఈ రూ.17,500 లెక్కేంటి అనే డౌట్‌ రావచ్చు. దీనికి ప్రత్యేక లెక్క ఉంది. ఇంటి రిపేర్ల కోసం రూ.6,500, బట్టల కోసం రూ.2,500, వస్తువుల కోసం రూ.2,500, కూలీ కింద రూ.6 వేలు కలిపి మొత్తం రూ.17,500 ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐతే.. ఇంటి రిపేర్లకు రూ.6,500 ఏమాత్రం చాలదని ప్రభుత్వానికీ తెలుసు. ఐతే.. కేంద్రం నుంచి వరద సాయం రావాల్సి ఉంది. ఢిల్లీకి పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి.. ఎంత సాయం చెయ్యాలో నిర్ణయిస్తుంది. ఆ సాయం డబ్బును బట్టీ.. వీలైతే వరద బాధితులకు మరింత సాయం చేసే అవకాశం ఉంది.

పంటలకు రూ.10 వేలు..
ఇదిలా ఉంటే.. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని రూ.10 వేలు దేనికీ చాలవని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎకరాకి రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఎంత పంట నష్టపోయారో రిపోర్టులు వచ్చాక, చూసి.. దానిని బట్టీ సర్కార్‌.. పరిహారంపై మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉంటుంది.

వదలని వానలు..
ఇదిలా ఉంటే.. వర్షాలు ఇంకా తెలంగాణ వదలడం లేదు. ఈ వారమంతా వానలు పడతాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఈ ఉదయం తీరం దాటినా ద్రోణి మరో 4 రోజులు కొనసాగనుంది. దీని ప్రభావంతో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.