Printing press Damage : విజయవాడలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. జనజీవనానికి తీవ్ర విఘాతం కలిగించాయి. ఇప్పటికీ విజయవాడ నగరం సాధారణ స్థితికి రాలేదు. ఇప్పుడు మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని రంగాలకు కూడా కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రధానంగా విజయవాడలో ప్రింటింగ్ ప్రెస్ లు అధికం. దాదాపు ఏడున్నర దశాబ్దాల చరిత్ర ఈ రంగం సొంతం. వరదలకు ఈ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పూడ్చుకోలేని నష్టం తప్పేలా లేదు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన కార్మికుల సైతం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పట్లో కోలుకోవడం కష్టమని యాజమాన్యాలు సైతం చెబుతున్నాయి.ప్రింటింగ్ రంగానికి విజయవాడ హబ్ గా ఉండేది. రాష్ట్రంలో 80% ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్ లు, ఇతర మెటీరియల్, పట్టాదారు పాస్ పుస్తకాలు, హెల్త్, బీమా కార్డులు, రేషన్ కార్డులు ఇక్కడే ప్రింటింగ్ చేసేవారు. కానీ ఆ ప్రింటింగ్ ప్రెస్ లన్నీ ఇంకా ముంపు లోనే ఉన్నాయి.
* పదివేల మంది ఉపాధి ప్రశ్నార్థకం
విజయవాడ ప్రింటింగ్ ప్రెస్ లలో దాదాపు పదివేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వారందరూ ఇప్పుడు వీధిన పడినట్లు అయింది. విజయవాడ శివారులోని సింగ్ నగర్, పాయకాపురం, ప్రకాష్ నగర్, కండ్రిక, రాజరాజేశ్వరి పేట లో అత్యధికంగా ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయి. ఇవన్నీ వరదలోనే ఇంకా కొనసాగుతున్నాయి.
* ఆ సంస్థలకు కోలుకోలేని నష్టం
విద్యాశాఖకు సంబంధించి మెటీరియల్ తయారు చేసే విక్రం, విజిఎస్, రాఘవేంద్ర వంటి పబ్లిషర్స్ కూడా తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 450 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు ప్రాథమికంగా అంచనా. 50 కోట్ల మీద యంత్రాలు, మరో 250 కోట్ల విలువైన పుస్తకాలు, ఇంకో 150 కోట్ల విలువైన పేపర్ బండిళ్లు నీటిలో మునిగి పాడయ్యాయి.ఎప్పటికీ ప్రింటింగ్ ప్రెస్ లలో నాలుగు అడుగుల వరకు వరద నీరు చేరింది.ప్రభుత్వ ఇండెంట్ ప్రకారం ముద్రించిన అనేక పాఠ్యపుస్తకాలు నీటిలో తేలుతున్నాయి.
* సరఫరా ఎలా
ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ సైతం ఇక్కడే జరిగేది.రాష్ట్రవ్యాప్తంగా 105 ప్రింటింగ్ ప్రెస్ లు ఉంటే వీటిలో 50 వరకు విజయవాడలోనే ఉన్నాయి.ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు ఇక్కడే పుస్తకాలు ముద్రించి పంపిణీ చేసేవారు.రాష్ట్ర విభజన తరువాత ఏపీకి సంబంధించి పాఠ్యపుస్తకాలు,ప్రశ్న పత్రాలు ముద్రించి అందిస్తున్నారు. కానీ భారీ వరదలతో ప్రింటింగ్ ఆగిపోయింది. వీటి పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.