New Year Celebration 2026: డిసెంబర్ 31 వస్తోంది అంటే చాలు.. చాలామంది చిందులు వేస్తారు. జనవరి ఒకటో తేదీకి ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇక నగరవాసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాగినంత తాగి.. తిన్నంత తిని దుమ్మురేపుతారు. హైదరాబాద్ నగర వాసులు ప్రతి ఏడాది నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. అలాగే గడిచిన సంవత్సరానికి ఉత్సాహంగా వీడ్కోలు చెబుతుంటారు.
డిసెంబర్ 31 ను చాలామంది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రోడ్లమీదకి వచ్చి డ్యాన్సులు వేస్తారు. మద్యం తాగి హల్ చల్ సృష్టిస్తుంటారు. సాధారణంగా మద్యం తాగిన వారు విపరీతమైన మైకంలో ఉంటారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామని ఉత్సాహంలో వారు రెచ్చిపోతుంటారు. కొందరైతే రోడ్ల మీదకి వచ్చి హంగామా సృష్టిస్తుంటారు. ఇటువంటి వారి వల్ల మిగతా వారికి ఇబ్బంది ఎదురవుతుంది. అంతేకాదు ఆ సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
హైదరాబాద్ నగరంలో గతంలో అనేక పర్యాయాలు అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇప్పటికే హైదరాబాద్ నగర బస్సులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి, జనవరి ఒకటి వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై అనేక నిబంధనలను విధించారు. ముఖ్యంగా ప్రజల భద్రత దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్ లోపల సైబరాబాద్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ అండ్ మెటీరియల్స్ తరలించే వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రి 10:30 నుంచి 2:00 వరకు ఈ వాహనాలపై ఆంక్షలు విధించారు. అంతేకాదు, రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు మొత్తం ఖాకీ దుస్తులు ధరించాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికుల రైడ్లను క్యాన్సల్ చేయకూడదని సూచించారు. అలా చేస్తే చలాన్ రూపంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఎవరైనా తాగి వాహనాలను నడిపితే.. పోలీసుల తనిఖీలలో పట్టుబడితే జైల్లో వేస్తారు. ఇప్పటికే సిటీ వ్యాప్తంగా న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తోంది. జనవరి ఒకటో తేదీన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోని పోలీసులు హైదరాబాద్ నగర వాసులకు ఒక సూచన చేశారు. న్యూ ఇయర్ రోజు కుటుంబంతో గడుపుతారా.. తాగి పోలీసులకు దొరుకుతారా.. ఆ తర్వాత అపరాధ రుసుం చెల్లించి.. జేబుకు చిల్లు పెట్టుకుంటారా ఆలోచించుకోవాలని.. సూచించారు.