Revanth Reddy meets Ramoji Rao: తెలుగు మీడియా రంగంలో రామోజీరావు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. పచ్చళ్ళు, దినపత్రిక, సినిమాలు, ఫిలిం సిటీ.. ఇంకా అనేక రకాల వ్యాపారాలు ప్రారంభించి వేలాదిమందికి ఉపాధి కల్పించి.. సరికొత్త వ్యాపార శక్తిగా ఎదిగారు రామోజీరావు.
రామోజీరావు కేవలం పత్రికా యజమానిగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా కూడా ఆయన ఎదిగారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు ప్రభుత్వంలో చక్రం తిప్పేవారని ప్రచారంలో ఉండేది. పైగా రామోజీరావు సిఫారసు చేస్తే చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తారనే వ్యాఖ్యలు కూడా వినిపించేవి. ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనేది బయటికి తెలిసేది కాదు.
2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని నాయకులు బలంగా నమ్మారు. అందులో రామోజీరావు కూడా ఉన్నారు. 2009లో టిడిపి తరఫున కొడంగల్ ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటికి ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు. ఎన్నికలు పూర్తయినప్పటికీ ఫలితాలు రావడానికి నెల దాకా సమయం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఇంకా కొంతమంది టిడిపి నేతలు రామోజీరావు అపాయింట్మెంట్ తీసుకున్నారు. వారంతా కూడా రామోజీ ఫిలిం సిటీ వెళ్లారు. ఇదే క్రమంలో వారితో రామోజీరావు భేటీ అయ్యారు. భోజనాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత రాజకీయాల గురించి చర్చ మొదలైంది.
రేవంత్ రెడ్డి, మిగతా టిడిపి నేతలు వచ్చిన విషయాన్ని రామోజీరావు గుర్తించారు. వారితో నేరుగా చెప్పకుండానే.. ” నేను ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని చంద్రబాబు నాయుడుకు చెప్పను. మంత్రి పదవులు ఇవ్వాలని కూడా సిఫారసు చేయను. నేను చీటీ ఇస్తే చంద్రబాబు ఓకే చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా అబద్ధం. కేవలం అనుభవం.. ప్రజలలో పనిచేసే విధానం ఆధారంగానే మంత్రి పదవులు వస్తాయి. మీరు నా దగ్గరికి వచ్చిన విషయం అర్థమైంది. మీరు మంచిగా పని చేస్తే మా పత్రికల్లో స్థానం ఉంటుంది. ఒకవేళ చెడు పని చేస్తే మాత్రం మొదటి పేజీలోనే మీకు కచ్చితంగా ప్లేస్ ఉంటుందని” రామోజీరావు వ్యాఖ్యానించారు. దీంతో విషయం అర్థమైపోయి రేవంత్ రెడ్డి, టిడిపి నేతలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే 2009లో జరిగిన ఎన్నికల్లోనూ టిడిపి అధికారంలోకి రాలేదు. మరోవైపు నాడు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. బలమైన కేసీఆర్ ను ఓడించి సరికొత్త శక్తిగా ఆవిర్భవించారు.