Telangana Politics : పాడి, అరికెపూడి మధ్య పోరు.. తెలంగాణలో రెడ్డి vs కమ్మ వ్యవహారంగా మారిందా?

తెలంగాణ రాజకీయాలను ప్రారంభం నుంచి చూసుకుంటే కుల ఆధిపత్యం దాదాపు తక్కువ. గంగా యమున తెహజీబ్ అనే సంస్కృతి ఇక్కడ అనాది కాలం నుంచి కొనసాగుతోంది.

Written By: NARESH, Updated On : September 14, 2024 5:41 pm

Kaushik Reddy Vs Arikepudi Gandhi

Follow us on

Telangana Politics : అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య గొడవ తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీస్తోంది.. గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి బతకడానికి వచ్చిన ఆంధ్రా వ్యక్తి అని మాట్లాడటం ఒకసారిగా ప్రాంతీయ విద్వేషాలకు కారణమైంది. అది కాస్త కులాల రంగు పులుముకుంది. ఆంధ్రప్రదేశ్లో కమ్మ వర్సెస్ రెడ్డి రాజకీయం మొదటి నుంచి ఉన్నదే. ఇప్పుడు ఆ వ్యవహారం తెలంగాణకు కూడా పాకిందనే వాదనలు వినిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కమ్మ, రెడ్డి కులాల మధ్య మొదటినుంచి పోరు ఉండనే ఉంది. అయితే చరిత్ర పుటల్లోకి ఒకసారి వెళితే ఆ రెండు వర్గాల మధ్య అలాంటి పోటీ ఉన్నట్టు కనిపించడం లేదు. వాస్తవానికి ఆ రెండు వర్గాలు ఒకే ప్రాంతంలో ఎప్పుడూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దాఖలాలు లేవు. వారు కలిసి ఉన్న ప్రాంతాలలో ఎటువంటి సమస్యలు కూడా లేవు. కానీ రాజకీయాలలో మాత్రం ఆ రెండు వర్గాల మధ్య చిచ్చు ఎప్పటికీ రగులుతూనే ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడూ రెడ్డి పార్టీ గానే ఉంది. కమ్మలు అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు, భారతీయ జనతా పార్టీలలో ఉన్నారు.. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత కమ్మ కులస్తులు అందులో చేరడం ప్రారంభించారు. అయినప్పటికీ కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే టిడిపి కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరికి తీయడంలో విజయం సాధించింది. దీంతో కమ్మవాళ్ళు టిడిపిని తమ సొంత పార్టీగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కమ్మ కులస్తులకు పెద్దపీట వేయడం ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత.. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం తారస్థాయికి చేరింది.. రెడ్డి వర్సెస్ కమ్మ పోరు అంతకంతకు పెరిగిపోయింది.

ఇక కౌశిక్ రెడ్డి గాంధీని ఉద్దేశించి చేసిన “ఆంధ్రోడు” అనే వ్యాఖ్య రాజకీయాలలో ప్రకంపనలకు కారణమైంది. నిజానికి గాంధీ 2014లో భారత రాష్ట్ర సమితిలో చేరడానికి ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన 2018, 2023 ఎన్నికల్లో శేరి లింగంపల్లి సీటును దక్కించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హఠాత్తుగా ఆయన ఆంధ్రోడు అయిపోయారు.. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అదే వ్యాఖ్యను మరింత బలంగా చేశారు.. అయితే మరుగున పడిపోయిన సెంటిమెంట్ ను మళ్లీ తెలంగాణలో రాజేయడానికి భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత.. కమ్మ సామాజిక వర్గం విస్తరించి ఉన్న ప్రాంతాలలో భారత రాష్ట్ర సమితి లాభపడింది. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ భారత రాష్ట్ర సమితి ఎకో సీట్లు గెలుచుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. కానీ భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని స్థానాలను గెలుచుకుంది. గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. ఆ సమయంలో కమ్మ సామాజిక వర్గం భారత రాష్ట్ర సమితికి అండగా నిలిచింది. చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి, కమ్మ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో ఉంది. అయితే సెంటిమెంట్ రగిలించడానికే కౌశిక్ రెడ్డి గాంధీని ఉద్దేశించి ఆంధ్రోడు అనే విమర్శ చేశారనే వాదన లేకపోలేదు. అయితే తెలంగాణ సమాజం కులాలుగా విడిపోలేదని.. ఇక్కడ సామాజిక చైతన్యం అలాగే ఉందని.. కౌశిక్ రెడ్డి , గాంధీ వ్యవహారం వల్ల తెలంగాణలో కమ్మ వర్సెస్ రెడ్డి రాజకీయం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.. సమున్నత తెలంగాణకు ఇలాంటి పరిణామం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి ఆంధ్రోడు అని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపడంతో.. భారత రాష్ట్ర సమితిని ఉద్దేశించి నెటిజెన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పడం ఇక్కడ విశేషం.